మౌనం వీడని గులాబీ బాస్.. BC రిజర్వేషన్లపై BRS పిన్‌డ్రాప్ సైలెన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-25 01:53:30  IST  )

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.

మౌనం వీడని గులాబీ బాస్.. BC రిజర్వేషన్లపై BRS పిన్‌డ్రాప్ సైలెన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సెప్టెంబర్ మొదటివారంలోనే షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాజకీయ నాయకులు సైతం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. చట్టబద్ధత లభించకపోవడంతో పార్టీ పరంగానైనా అమలుచేసి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నది. అదే బాటలో బీజేపీ సైతం ఇప్పటికే బీసీలకు 42 శాతం సీట్లు పార్టీ పరంగా కేటాయిస్తామని కుండబద్ధలు కొట్టింది. కానీ.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఇంతవరకూ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో గులాబీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.

కేసీఆర్, కేటీఆర్ మౌనం వెనక?

బీసీ రిజర్వేషన్లపై ముందు నుంచీ బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకున్నది లేదు. పార్టీలోని కీలక నేతలు బీసీల ఉద్యమానికి సైతం పెద్దగా మద్దతు ప్రకటించిందీ లేదు. అందుకే కరీంనగర్‌ కేంద్రంగా నిర్వహించాలనుకున్న బీసీ సభ సైతం వాయిదాపడింది. మొదటి సారి వాయిదా వేసినప్పుడు వర్షాలు అనే కారణాలను చెప్పారు. మరోసారి తేదీని ప్రకటించి మళ్లీ వాయిదా వేశారు. వర్షాలు ఉండటంతో నిర్వహించలేకపోతున్నామని చెప్పినప్పటికీ.. ఈ సభ నిర్వహించేందుకు పార్టీలోని ముఖ్యనేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరిగింది. అందుకే బీసీ నేతలు సైతం సభను నిర్వహించలేకపోయారన్న టాక్ నడిచింది. అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్ బీసీ ఉద్యమంపై పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదని.. సభను కూడా పెద్దగా పట్టించుకోలేదన్న వాదన బీసీ నేతల్లో ఉన్నది. మరోవైపు ఇద్దరు కీలక నేతలు బీసీ రిజర్వేషన్లపై ఇంతవరకూ పెద్దగా మాట్లాడింది లేదు. కేసీఆర్ ఫాంహౌస్ వేదికగా ఓ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. చట్టబద్ధత కాకుంటే పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తారా? లేదా? అన్నది క్లారిటీ ఇవ్వడం లేదు.

బీసీ నేతల్లో అసంతృప్తి

ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్ల విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాయి. చట్టబద్ధత రాని పక్షంలో పార్టీ పరంగా ఇస్తామని వెల్లడించాయి. కానీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతసేపూ చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, పార్టీ తరఫున తమ స్టాండ్ ఏమిటన్నది ఇంతవరకూ చెప్పడం లేదు. ఆర్డినెన్స్ రాకుంటే తమ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న క్లారిటీ ఎక్కడా ఇవ్వడం లేదు. దీంతో ఈ ఇద్దరి నేతల వైఖరి ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.

సెప్టెంబర్‌లో నోటిఫికేషన్?

మరోవైపు.. ప్రభుత్వం వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి అదే నెలలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఈ క్రమంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్నిరకాల ఏర్పాట్లను సిద్ధం చేసింది. అటు ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంది. అటు.. కాంగ్రెస్ లో ఉన్న బీసీ కార్యకర్తలు సైతం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పార్టీ పరంగా హామీ లభించడంతో ఎన్నికలకు రెడీ అవుతున్నారు. కానీ.. గులాబీ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కుతుందా? లేదా? అన్న ప్రశ్నలు వారిలో కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న సమయంలో పార్టీ నుంచి క్లారిటీ ఇవ్వకపోవడంపై క్షేత్రస్థాయి నేతల్లో అసంతృప్తి కనిపిస్తున్నది.

Next Story