ఏపీలో 'పెగాసస్‌' హీట్.. టీడీపీ కండీషన్

by Disha Web Desk 4 |
ఏపీలో పెగాసస్‌ హీట్..  టీడీపీ కండీషన్
X

దిశ, ఏపీ బ్యూరో: పెగాసస్‌ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లుతోంది. ఐదురోజులుగా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై చర్చకు తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టారు. సభలో ప్లకార్డులు చేతపట్టి నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే వారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేసేవారు. నేడు సీన్ మారిపోయింది. ఇప్పుడు వైసీపీ గేర్ మార్చింది. టీడీపీ జంగారెడ్డి గూడెం మరణాలను అస్త్రంగా చేసుకుని సభలో రగడ చేస్తుంటే ఇప్పుడు వైసీపీ పెగాసస్‌ టాపిక్‌తో సభలో అలజడి సృష్టిస్తోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. పశ్చిమబంగా సీఎం మమతా బెనర్జీ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. పెగాసస్‌పై చర్చకు ప్ర‌భుత్వ‌ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి నోటీస్‌ ఇచ్చారు. దీంతో అసెంబ్లీలో ఈ అంశంపై దీర్ఘకాలిక చర్చకు స్పీకర్ అనుమతినిచ్చారు. అలాగే విచారణ నిమిత్తం హౌస్‌ కమిటీ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మరోవైపు పెగాసస్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ సైతం సవాల్ విసిరింది. అయితే కల్తీసారా, జంగారెడ్డి మరణాలపై చర్చిస్తారా? అని కండీషన్ పెట్టింది. మెుత్తానికి సభలో పెగాసస్‌ అంశం హీటెక్కిస్తోంది.

పెగాసస్ కొనడం ఘోరమైన నేరం : మంత్రి బుగ్గన

ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు, సమాచారానికి తీవ్ర భంగం కలిగించే పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనడం ఘోరమైన నేరమని.. అలాంటి నేరం చంద్రబాబు చేశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పెగాసస్‌ కొనుగోలు చేశారని సమాచారం ఉందని అసెంబ్లీ సాక్షిగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చెప్పారని బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన చర్య మానవ హక్కులకు భంగం కలిగించడమేనని, పెగాసస్‌తో రాజకీయ నేతలు, వ్యాపారస్థులు, సామాన్య ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలించడంతో పాటు ఐటీ గ్రిడ్, సేవా మిత్ర ద్వారా ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించారని సభలో ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అలర్ట్‌ అవ్వడంతో టీడీపీ కుట్ర భగ్నమైందని మంత్రి బుగ్గన చెప్పారు.

చంద్రబాబు దొరికిపోతారు : మంత్రి కన్నబాబు

పెగాసస్‌ అంశంపై అసెంబ్లీలో హౌస్‌ కమిటీ వేస్తామంటే టీడీపీ ఎందుకు భయపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. హౌస్‌ కమిటీలో అన్ని పార్టీల సభ్యులుంటారని, విచారణ సక్రమంగానే జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోలేరని ఎద్దేవా చేశారు. పెగాసస్ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. హౌస్‌ కమిటీ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు. తప్పు చేశాం, ప్రాయశ్చిత్తం చేసుకుందామని కూడా టీడీపీకి లేదని మండిపడ్డారు. ఆనాడు ఐటీ మంత్రిగా నారా లోకేశ్ ఉన్నారని..హౌస్‌ కమిటీపై నారా లోకేశ్‌ చాలా తేలికగా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

హౌస్ కమిటీ చర్చకు సిద్ధమే : నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పెగాసస్ ‌విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెగాస‌స్‌పై హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ..ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్ప‌ష్టం చేశారు. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా? అని వైసీపీ ప్రభుత్వానికి లోకేశ్ సవాల్ విసిరారు. శాస‌న‌మండలిలో వైసీపీ ప్ర‌తిపాదించిన మేర‌కు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ అనుమ‌తిచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసస్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేశ్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ లోకేశ్ పేర్కొన్నారు.

పెగాసస్‌పై మమత వ్యాఖ్యలు ఫేక్ : అచ్చెన్నాయుడు

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌పై పార్లమెంట్‌లో జరిగిన చర్చపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మమతా బెనర్జీ కేంద్రం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, పార్లమెంటులో చర్చ పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. విజయసాయి రెడ్డి కేసులకు భయపడి మోడీకి సలాం కొట్టి చర్చ వద్దన్నారని గుర్తు చేశారు. అయితే ప్రశాంత్ కిషోర్‌కి చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు మీద బురద చల్లడానికి మమత బెనర్జీతో వైసీపీ నేతలు ఫేక్ మాటలు చెప్పించారని ఆరోపించారు. కానీ ఇక్కడ అసెంబ్లీలో మాత్రం చర్చ కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. మీకు, మీ సీఎంకు దమ్ముంటే చర్చ జరిపి నిజానిజాలు ప్రజల ముందుంచాలి అని అచ్చెన్న సవాల్ విసిరారు.

ఆ అంశాన్ని నాకు ముడిపెట్టొద్దు: ఏబీ వెంకటేశ్వరరావు

టీడీపీ హయాంలో పెగాసెస్‌ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై వ్యక్తిత్వ ఆరోపణలకు పాల్పడ్డారని అన్నారు. పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 మే వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ డీజీపీ, సీఐడీ, ఏసీబీలాంటి ఏ ప్రభుత్వ విభాగం కూడా పెగాసస్‌ను కొనలేదు.. వాడలేదు అని.. అయితే 2019 మే తర్వాత ఏం జరిగిందనే దానికి తన దగ్గర సమాచారం లేదన్నారు. 2021 ఆగస్టు వరకు ఈ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయం వెల్లడించిందన్నారు. ఆరోపణలకు నేను సమాధానం చెప్పాల్సి రావడం నా దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పెగాసస్‌తో ముడిపెట్టి నాపై అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేస్తే కోర్టులో చాలెంజ్‌ చేశానని.. తనపై కేసులు పెట్టేందుకు కొందరు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు.


Next Story

Most Viewed