గంటలో 7 ఇంజెక్షన్లు.. ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి యువకుడు బలి

by Disha Web Desk 4 |
గంటలో 7 ఇంజెక్షన్లు.. ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి యువకుడు బలి
X

దిశ, వర్థన్నపేట: ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. జ్వరం వచ్చిందని ఆర్ఎంపిని సంప్రదిస్తే తెలియని వైద్యం చేయడం వల్ల ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో చోటు చేసుకుంది.. మృతుడి భార్య పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు, వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్(28) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈనెల 26వ తేదీ నాడు తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడుతుండగా భార్య మేఘన ఫిరంగిగడ్డలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్‌ను సంప్రదించారు.

ఆర్ఎంపీ డాక్టర్, కత్తి నవీన్‌ను పరీక్షించి 2 ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు గ్లూకోజ్‌లో మరో 4 ఇంజక్షన్లు వెంటనే ఇచ్చాడు. దాంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. సదరు ఆర్ఎంపీ వెంటనే మరో ఇంజక్షన్ ఇచ్చాడు. ఇలా గంట వ్యవధిలోనే 7 ఇంజక్షన్లు ఇవ్వడంతో పరిస్థితి విషమించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు సదరు ఆర్ఎంపీని నిలదీయడంతో అతను భయపడి వెంటనే నవీన్‌ను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వాళ్లు పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని చెప్పడంతో నవీన్‌ను వరంగల్‌లోని గార్డియన్ హాస్పిటల్లో చేర్పించారు.

అక్కడ ఒక్కరోజు చికిత్స తర్వాత పరిస్థితి మరింత విషమించడంతో ఈనెల 28న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. ఆర్ఎంపీ డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంగా చికిత్స ఇవ్వడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ భార్య మేఘన, వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే, తన నిర్లక్ష్యం వల్ల నవీన్ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆర్ఎంపీ శ్రీనివాస్ వర్థన్నపేట నుంచి పరారయ్యాడు. అలాగే, బాధిత కుటుంబం తనపై కేసు పెట్టకుండా ఉండడానికి వాళ్లను డబ్బుల రూపేణా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఐతే, బాధిత కుటుంబం అందుకు ఒప్పుకోకుండా తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

చెలరేగిపోతున్న ఆర్ఎంపీలు

వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు సమయానికి రావడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లలో ట్రీట్మెంట్లు చేసుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్‌కు ఇష్టం వచ్చిన టైంలో వస్తూ తమను సరిగా పట్టించుకోవడం లేదని రోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ డాక్టర్ల వైఖరి, ఆర్ఎంపీలు, ప్రైవేటు డాక్టర్లకు వరంగా మారడంతో వాళ్లు చెలరేగిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తే ఆర్ఎంపీలు, ప్రైవేటు హా స్పిటళ్లకు వెళ్లే బాధ తప్పతుందని స్థానికులు చెబుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story