పాలమూరు లోక్‌సభ బరిలో త్రిముఖ పోరు తప్పదా.? రోజురోజుకు మారుతున్న పరిణామాలు

by Disha Web Desk 1 |
పాలమూరు లోక్‌సభ బరిలో త్రిముఖ పోరు తప్పదా.? రోజురోజుకు మారుతున్న పరిణామాలు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: నిన్న, మొన్నటి వరకు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి కేసీఆర్ పర్యటనతో త్రిముఖ పోటీకి బలం పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీ‌చంద్‌ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందు నుంచి ప్రధాన పార్టీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉంటుందని విస్తృత ప్రచారం జరిగింది. కానీ రోజురోజుకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్‌నగర్ పార్లమెంటు రాజకీయాలలో మార్పులు తెస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహించడం.. పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయం నల్లేరు మీద నడకల ఉంటుందని అందరూ ఆశించారు. కానీ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ అభ్యర్థిత్వం ఖరారు కావడం, పోటీ కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మధ్య సాగుతుందని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎన్నికల కోడ్ అడ్డుగా ఉంది.

దీంతో కొన్ని నియోజకవర్గాలలో సెట్టింగ్ ఎమ్మెల్యేలపై అప్పుడే కొంత వ్యతిరేకత ప్రారంభం కావడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కొంత కలిసి వచ్చింది. దీనికి తోడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో బీజేపీ అభ్యర్థి మంచి పట్టు సాధించింది. ఒకవైపు అధికార పార్టీ అభ్యర్థి వంశీ చందు రెడ్డి.. మరోవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య పోరాటం జరుగుతుందని ఎవరు గెలిచినా.. తక్కువ మెజారిటీలో గెలుస్తారని ప్రచారం జరిగింది. కానీ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నడంతో అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ జరగడం ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story