ఉపాధ్యాయుల పోరులో గెలుపెవరిదో..? ఆసక్తికరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పోరు

by Disha Web Desk 1 |
ఉపాధ్యాయుల పోరులో గెలుపెవరిదో..? ఆసక్తికరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పోరు
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో జరుగుతున్న పోరు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ప్రధాన రాజకీయ పక్షాల నుంచి బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇద్దరికీ గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పని చేసిన అనుభవం ఉండగా.. ఒక అభ్యర్థి మాత్రం చట్టసభలకు తొలిసారిగా పోటీపడుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. తొలుత ఏకపక్షంగా కనిపించిన పార్లమెంట్ ఎన్నికల పోరు క్రమంగా ముక్కోనపు పోటీగా మారుతున్నది. బీజేపీ అభ్యర్థి జి నగేష్ ఇటీవలనే గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు ఈ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ మానవ హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు ఉట్నూరు ఏజెన్సీలో ఆదివాసుల సమస్యలపై పోరాటం చేసిన మహిళగా పేరు ఉంది. ముగ్గురు బడిపంతుళ్ల నడుమ జరుగుతున్న ఈ ఆసక్తికర పోరులో ‘గురు’ బలం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ మొదలైంది.

ముగ్గురు ఉపాధ్యాయులే.. ఒకే సామాజికవర్గం

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టి రిజర్వుడ్ పార్లమెంట్ సెగ్మెంట్‌గా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండడం కొత్త చర్చకు దారితీస్తున్నది. గతంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఇక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి ఆదివాసులకు, లంబాడాలకు టికెట్లు ఇచ్చేవి. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఏ ఒక్క రాజకీయ పార్టీ లంబాడాలకు టికెట్ ఇవ్వలేదు. మూడు రాజకీయ పక్షాలు ఆదివాసీ సమాజానికి చెందిన గోండు తెగలకు టికెట్లు ఇచ్చాయి. ఆదివాసుల్లో ఉన్న ఇతర ఉప కులాలకు టికెట్లు ఇవ్వాలని కొన్ని తెగలు ఆందోళన చేసినప్పటికీ మూడు రాజకీయ పక్షాలు ఒకే తెగకు చెందిన వారికి టికెట్లు కట్టబెట్టాయి.

దీంతో ఆదిమా ఉపకులాల వర్గాలు, లంబాడాలు రాజకీయ పార్టీలపై కొంత ఆగ్రహంతో ఉన్నారు. వారి ఓట్లు ఎటువైపు మల్లుతాయో అన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు ముగ్గురు అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే కాగా... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఉపాధ్యాయులు, గిరిజన ఉద్యోగులు సహా మిగతా వర్గాల ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ అభ్యర్థి నగేష్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కులకు గతంలో చట్ట సభల్లో పనిచేసిన అనుభవం ఉండగా... కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తొలిసారి చట్ట సభలకు పోటీ పడుతున్నారు. అయితే, ఆమెకు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఉపాధ్యాయుల నడుమ పోరు ‘గురు’ బలం ఎవరి వైపు నిలువనుందో వేచి చూడాలి.

Next Story