ప్రపంచంలోనే పెద్దదిగా మూసీ ప్రాజెక్టు.. ఆ భావాలకు అద్దంపట్టేవిధంగా నిర్మాణం

by Gantepaka Srikanth |

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది.

ప్రపంచంలోనే పెద్దదిగా మూసీ ప్రాజెక్టు.. ఆ భావాలకు అద్దంపట్టేవిధంగా నిర్మాణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది. లండన్‌లోని థేమ్స్ నది 39 కి.మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టారు. కానీ హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టు 55 కి.మీ వరకు ఉన్నది. ఇప్పటికే ప్రపంచంలోని ఆయా దేశాల్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టును మూసీ పరిస్థితి, ప్రపంచంలోని ఆయా దేశాల్లో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, మూసీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ప్రభుత్వ విజన్, 55 కి.మీలకు మాస్టర్‌ప్లాన్, మొదటి దశ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ నది ప్రవాహం, మూసీలో మురుగుకాకుండా అడ్డుకోవడం, బఫర్ జోన్‌ను ఎలా ఉపయోగించాలి? గాంధీ సరోవర్ ప్రాజెక్టు, ఈస్ట్-వెస్ట్ మొబులిటీ కారిడార్, మూసీ పునరుజ్జీవనంలో సాంస్కృతిక అంశాలు, లౌకిక భావాలకు అద్దంపట్టేవిధంగా నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

రూ.7 వేల కోట్లతో..

‘మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టనున్న 21 కిలోమీటర్ల ప్రాజెక్టుకు భూసేకరణ ఖర్చు కాకుండానే రూ.6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం ఉండే భవనం 100 మీటర్ల వరకు ఉంటుంది. దీనిపై గాంధీ విగ్రహం 123 అడుగులు ఉంటుంది.

ప్రపంచ నగరాల్లో..

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపట్టడానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు ఆయా దేశాల్లో చేపట్టిన రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. సియోల్‌లోని చియాంగ్ చీన్ నది సియోల్‌లో 5.8 కి.మీ మేర ప్రవహిస్తోంది. రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కారణంగా రోజు 50 వేల మందికిపైగా సందర్శకులు వస్తున్నారు. లండన్ నగరంలో థేమ్స్ 39 కి.మీ మేర ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ 27వేల మంది, టోక్యోలోని సుమిదా ప్రాజెక్టు చేపట్టడంతో 1.5 లక్షల మంది సందర్శకులు వస్తున్నారు. సింగాపూర్‌లో 40 వేల మంది, ఫ్రాన్స్‌లోని సీనే నది ప్రాజెక్టు కారణంగా ఏడాదికి 40 బిలియన్ మంది సందర్శిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతోపాటు ఆ దేశ ఎకానమనీలో 30 శాతం టూరిజం ద్వారా వస్తుందని గుర్తించారు. గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ సందర్శించడానికి రోజూ 7 వేల మంది వస్తున్నారు. దీని ద్వారా 85 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అధికారులు చెబుతున్నారు.

365 రోజులు స్వచ్ఛమైన నీరు

మూసీలో 365 రోజులు స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా 2.5 టీఎంసీల గోదావరి జలాలను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీంతోపాటు మూసీలోకి మురుగురాకుండా ఎస్టీపీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27 ఎస్టీపీలు ఇప్పటికే ఉన్నాయి. కొత్తగా 27 ఎస్టీపీలను ప్రారంభించారు. మరో 39 ఎస్టీపీల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 93 ఎస్టీపీల ద్వారా మూసీలోకి ఎలాంటి మురుగునీరు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈస్ట్-వెస్ట్ కారిడార్‌తో

ఈస్ట్-వెస్ట్ కారిడార్‌తో 50 శాతం దూరంతోపాటు సమయం కలిసోస్తుంది. గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు 45 నిమిషాల్లో చేరుకోవడానికి అవకాశముంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు (నార్త్) మార్గంలో గండిపేట నుంచి గౌరెల్లి వరకు 91 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్డు సౌత్ మార్గంలో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు 69 కిలోమీటర్లు దూరం ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడార్‌తో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు 43 కి.మీ మాత్రమే అవుతుంది. 45 నిమిషాల్లో ప్రయాణించడానికి అవకాశముంది.

ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం: జన ఆందోళన్

ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లే మూసీ నది పునరుద్ధరణ లక్ష్యానికి మూసీ జన ఆందోళన్ కట్టుబడి ఉందని, కానీ మూసీ నది పునరుద్ధరణను పర్యావరణానికి అనుకూలమైన నదీ పరివాహక ప్రణాళిక ద్వారా చేయాలని, ప్రజలను బలవంతంగా వెళ్లగొట్టే విధంగా ఉండకూడదని, వాణిజ్యపరమైన నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా చేయకూడదని వెల్లడించింది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై మూసీ జన ఆందోళన్ స్పందించింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని ప్రెజెంటేషన్లు, పత్రాలు, ప్రజా ప్రసంగాలను నిశితంగా విశ్లేషించిన తర్వాతనే సమగ్ర స్పందన ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు అందిస్తామని ప్రకటించింది.

Next Story