ఇసుక దందాలో మైనింగ్ సిబ్బంది చేతివాటం.. సర్కారు ఆదాయానికి రూ.లక్షల్లో గండి

by Kema Shiva Kumar |

ఇసుక దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టినా అడ్డుకట్ట వేయలేకపోతున్నది.

ఇసుక దందాలో మైనింగ్ సిబ్బంది చేతివాటం.. సర్కారు ఆదాయానికి రూ.లక్షల్లో గండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టినా అడ్డుకట్ట వేయలేకపోతున్నది. నిత్యం ఇసుక రీచ్‌ల నుంచి శాండ్‌ను పర్మిషన్‌కు మించి తరలిస్తున్నారు. వే బిల్లులో ఉన్నదానికి.. లారీల్లో ఇసుక లోడ్ మధ్య తేడాలు ఉంటున్నాయని ఆఫీసర్ల తనిఖీల్లో స్పష్టమవుతున్నది. దీంతో సర్కారుకు నిత్యం రూ.40 నుంచి 50 లక్షల వరకు గండిపడుతున్నది. ఇసుక దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వయిరీ చేస్తున్నది. దందాను మైనింగ్ అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రవాణా శాఖ తనిఖీల్లో 5 రోజుల్లోనే 192 వాహనాలపై ఓవర్ లోడ్ కేసులు నమోదు చేశారంటే ఏ మేర దోపిడీ జరుగుతుందో స్పష్టమవుతోంది.

సబ్ కాంట్రాక్టులకు ఇసుక రీచ్‌ల బాధ్యతలు!

రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లిలో ప్రస్తుతం ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నాయి. 16కు పైగా రీచ్‌ల నుంచి శాండ్ తరలింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను సర్కారు తీసుకొచ్చింది. బుక్ చేసుకున్నవారికి సీరియల్ వారీగా ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఇదంతా పైకి కనబడుతుంది. బయటకు కనబడకుండా లోపల మరో ప్రక్రియ కొనసాగుతోంది. ఇసుక రీచ్‌లు ఉన్న దగ్గర గ్రామపంచాయతీకి చెందిన సంఘాలకు లేకుంటే గ్రామపంచాయతీకి ఇసుక రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతలు సర్కారు అప్పగిస్తుంది. కాగా, వారు సబ్ కాంట్రాక్టులకు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఇసుకను లారీల్లో తరలించే టైంలో మైనింగ్ శాఖకు సంబంధించిన సిబ్బంది సైతం పర్యవేక్షణ చేస్తారు. ఏ లారీ ఎంత ఇసుక బుక్ చేసింది.. వే బిల్లు‌ను సైతం తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అక్కడ పనిచేసే మైనింగ్ శాఖ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో లారీలో 10 నుంచి 15 టన్నుల వరకు ఇసుకను అదనంగా లోడ్ చేస్తున్నారు. ఇవి ఆరోపణలు కాదు.. రవాణాశాఖ ఆఫీసర్లు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లోనే స్పష్టమవుతోంది.

మామూళ్ల మత్తులో మైనింగ్ శాఖ సిబ్బంది!

ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు రవాణాశాఖ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో కేవలం 5 రోజుల్లోనే 192 ఓవర్ లోడ్ వెహికల్స్ పట్టుబడ్డాయి. ఇందులో 100కు పైగా ఇసుక తరలిస్తున్న లారీలేనని ఆఫీసర్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లిలో 7, మేడ్చల్ మల్కాజిగిరిలో 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4, ములుగు జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 11 లారీలు పట్టుబడగా, ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీల్లో పట్టుబడినట్టు వెల్లడించారు. ఈనెల 24న 16 రీచ్‌లల్లో ఇసుకకు అనుమతి ఇచ్చారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న 1,189 లారీలకు ఇసుక పర్మిషన్ ఇచ్చారు. ఒక్కో లారీ 3 నుంచి 5 ఎక్స్‌ట్రా బకెట్లు చొప్పున వేస్తున్నట్టు తెలిసింది. 9 నుంచి 15 టన్నులకు పైగా అదనంగా లారీల్లో నింపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉదా..1,189 లారీల్లో 9 టన్నులు అదనంగా వేస్తే రూ.42 లక్షలా 47 వేల ఆదాయం ప్రభుత్వానికి గండిపడుతోంది. ఇంకా ఎక్కువ వేస్తే రూ.50 లక్షలకుపైగా రోజువారీగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన మైనింగ్ శాఖ సిబ్బంది చోద్యం చూస్తుందనే ఆరోపణలున్నాయి. మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.

దోపిడీపై ఇంటర్నల్ ఎంక్వయిరీ కంటిన్యూ..

తప్పుడు పత్రాలతో ఇసుక దోపిడీ జరుగుతోందని ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇంటర్నల్ ఎంక్వయిరీని రెండు నెలల క్రితం వేశారు. ఎవరి ఆధ్వర్యంలో ఇసుక పక్కదారి పడుతోందనే దానిపై ఎంక్వయిరీ కొనసాగుతోంది. బల్క్ బుక్కింగ్ యూజర్లు, ఆర్డర్లు ఎన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నదనే దానిపై ఆఫీసర్లు వివరాలు సేకరిస్తున్నారు. తప్పుడు పత్రాలు ఉన్నట్టు గుర్తించిన ప్రతి బుకింగ్‌ను బ్లాక్‌లో పెడుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఆఫీసర్ల పాత్రపై ఆరా తీస్తున్నారు.

మైనింగ్ డిపార్ట్‌మెంట్‌పై సీఎం స్పెషల్ ఫోకస్..

మైనింగ్ శాఖపై వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ఇసుక ద్వారా వచ్చే ఇన్‌కమ్ పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు. ప్రతినెలా టార్గెట్ సాధించాలన్నారు. కొందరు అధికారులపై ఆరోపణలు రావడంతో డిప్యూటేషన్‌పై వచ్చిన వారిని తిరిగి వెనక్కి పంపారు. సొంతశాఖ ఆఫీసర్లకే బాధ్యతలు అప్పగించారు. అయినా, ఇసుక దందా మాత్రం ఆగడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక రీచ్‌లపై నిఘా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story