- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధరణి’ లొసుగులతో వచ్చిన తంటా.. అమ్మేసిన భూములకు మళ్లీ పాస్ బుక్స్
ధరణి, ఆర్వోఆర్-2020లోని లొసుగులను ఆధారంగా చేసుకొని అక్రమార్కులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి, ఆర్వోఆర్-2020లోని లొసుగులను ఆధారంగా చేసుకొని అక్రమార్కులు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. దశాబ్దాల క్రితమే ప్లాట్లుగా అమ్మేసిన స్థలాలకు పట్టా పాస్ బుక్స్ పొంది మళ్లీ ఇప్పుడు విక్రయిస్తున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో రెండున్నర దశాబ్దాల క్రితమే భారీ ఎత్తున వెంచర్లు వేశారు. లే అవుట్ అనుమతులు తీసుకోకుండా, నాలా కన్వర్షన్ చేయించకుండానే.. గుంటలు, గజాల లెక్కన అమ్మేశారు. స్టాంప్ డ్యూటీ కట్టించుకున్న రిజిస్ట్రేషన్ల శాఖ సేల్ డీడ్స్ చేతిలో పెట్టింది. ఇప్పుడు అవే ప్లాట్లకు దొడ్డిదారిన హక్కులు పొంది కొందరు మళ్లీ వ్యవసాయ భూములుగా అమ్మేస్తున్నారు. సుమారు 1,800 ప్లాట్లకు సంబంధించిన భూమిని ఒకే గ్రామంలో వ్యవసాయ భూమిగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల యజమానులు వస్తే కొందరు లీడర్లు, రియల్టర్లు బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేలాది సేల్ డీడ్స్
తుమ్మలూరులో గ్యాలక్సీ టేక్ ప్లాంటేషన్ ప్రైవేటు లిమిటెడ్, సౌందర్య రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి సాధన ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కాకతీయ షీప్ అండ్ డెయిరీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్, కాంక్రీట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ఎల్ఎల్పీ వంటి కంపెనీలు లే అవుట్లు చేశాయి. 200 గజాలు, 300 గజాలు, 500 గజాల లెక్కన అమ్మేశారు. ప్రధానంగా తుమ్మలూరు సర్వే నం. 181లో 412, సర్వే నం. 376లో 169, సర్వే నం. 377లో 11, సర్వే నం. 378లో 40, సర్వే నం. 379లో 61, సర్వే నం. 380లో 94, సర్వే నం. 382లో 31, సర్వే నం. 383లో 42 వంతున సేల్ డీడ్స్ అయ్యాయి. ఇంకా అనేక సర్వే నంబర్లలోని ల్యాండ్‌ను లే అవుట్లు చేశారు. వేలాది సేల్ డీడ్స్ అయినట్లు ఈసీలో స్పష్టంగా తెలుస్తున్నది. అయితే టేకు చెట్లు పెడతామంటూ చేసిన లే అవుట్లలోని సుమారు 1,800 ప్లాట్లు మళ్లీ అమ్మేశారని సమాచారం. పాతిన రాళ్లను తొలగించి, ప్లాట్ల యజమానులకు వారి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వారికే తెలియకుండా చేశారు. ఇప్పుడేమో పాత రికార్డుల ప్రకారం పాస్ పుస్తకాలు పొంది తిరిగి అదే ల్యాండ్‌ని అమ్మేస్తుంటే రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో పలు సర్వే నంబర్లలోని ల్యాండ్‌ను ప్లాట్లుగా సేల్ చేసినట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.
కొనుగోలు చేసింది పేదలే..
టేకు మొక్కలు పెడతాం.. వాటిని అమ్మేస్తే రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని నమ్మించి మహేశ్వరం మండలం తుమ్మలూరులో రెండున్నర దశాబ్దాల క్రితమే సర్వే నం.380 నుంచి 387, మరికొన్ని సర్వే నంబర్లలో గ్యాలక్సీ టేక్ ప్లాంటేషన్ పేరిట సుమారు 1,800కు పైగా ప్లాట్లు గుంటలు, గజాల లెక్కన అమ్మేశారు. భవిష్యత్తులో తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతాయని చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కానీ ఎవరూ మ్యుటేషన్ చేయించుకోలేదు. వీటికి సంబంధించిన సేల్ డీడ్స్ మాత్రమే కస్టమర్ల దగ్గర ఉన్నాయి. తుమ్మలూరులో టేక్ ప్లాంటేషన్ పేరిట చేసిన వెంచర్‌లో పేదలు, పేద ముస్లిం కుటుంబాలే అత్యధికంగా కొనుగోలు చేశాయి. హైదరాబాద్‌తో పాటు నాందేడ్, గుల్బర్గా, జహీరాబాద్ ప్రాంతాల్లోని ముస్లిం కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్స్ ద్వారా తెలుస్తున్నది.
ధరణిని అడ్డం పెట్టుకొని..
దశాబ్దాల క్రితమే అమ్మేసిన ప్లాట్లకు ధరణి పోర్టల్, ఆర్వోఆర్-2020ను అడ్డం పెట్టుకొని తిరిగి పట్టాదారు పాస్ పుస్తకాలను పొందారు. రెవెన్యూ అధికారుల సహకారంతో ధరణి రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదు చేసి పట్టాదారుల పేర్లను రాయించుకున్నారు. అనంతరం వందలాది ఎకరాల ప్లాట్ల ల్యాండ్‌కు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఇదంతా ఆర్ఐ, డీటీ, ఆర్డీవో, కలెక్టర్లకు తెలిసే జరిగిందనే ఆరోపణలున్నాయి. సుమారు 1,800 ప్లాట్ల ల్యాండ్ అంటే ఎంత విస్తీర్ణమో అంచనా వేయొచ్చు. పైగా 1 బీ ఫారం ఇచ్చినప్పుడు స్థానికంగా విచారణ చేస్తారు. అప్పుడైనా ఇదంతా ప్లాట్లుగా అమ్మేశారన్న వాస్తవాలు రెవెన్యూ అధికారులకు తెలుస్తాయి. అందుకే ఇది అధికారుల కనుసన్నల్లోనే నడిచింది. అయితే 25 ఏండ్ల క్రితం పట్టాదారులెవరు? వారి వారసులు ఎవరు? నిజమైన వారసులేనా? ఏ ఆధారాలతో ఇటీవల సక్సెషన్ చేశారు? ఏమైనా ఎంక్వయిరీ చేశారా? సరైన వారసులేనా? అన్న విషయాలు రెవెన్యూ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ధరణిని అడ్డం పెట్టుకొని పాస్ బుక్స్ పొందారు. ఆ తర్వాత పట్టాదారులు చనిపోయారని వారసులు సక్సెషన్ చేయించుకున్నారు. ఇక వందలాది మంది ప్లాట్ల యజమానులకు మొండి చేయి చూపించారు.
లెక్క లేనన్ని ట్రాన్సాక్షన్స్
టేక్ ప్లాంటేషన్ పేరిట అమ్మేసిన ప్లాట్ల స్థలాన్ని మహేశ్వరం మండల రెవెన్యూ అధికారుల సహకారంతో లెక్క లేనన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు. డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్, ఆర్డీవోల భాగస్వామ్యంతో ప్లాట్ల భూమి వ్యవసాయ భూమిగా మార్చేసి హక్కులు కల్పించారు. వెంట వెంటనే చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, ఇటు ధరణి, భూ భారతి వెబ్ సైట్ల నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ లెక్కిస్తే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అంచనా వేయొచ్చు. అయితే ఇవి తమ స్థలాలని, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ లిఖితపూర్వకంగా యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. ధరణిలో స్లాట్ బుక్ అయ్యిందన్న నెపంతో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్ వెనుక ఏం జరుగుతుందో అందరికీ తెలుసునంటూ స్థానిక రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండు రోజుల్లో రిజెక్ట్
ఈ లే అవుట్‌లో తాము ల్యాండ్ కొనుగోలు చేశామని ప్లాట్ల యజమానులు పెండింగ్ మ్యుటేషన్ ఆప్షన్ కింద అప్లయ్ చేశారు. అయితే అలాంటి వాటిని 24 గంటల్లోపే రిజెక్ట్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము స్టాంప్ డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ చేయించుకున్నప్పుడు మ్యుటేషన్ చేయకుండా రిజెక్ట్ చేయడం వెనుక ఏం జరుగుతుంది? వాళ్లు కూడా 25 ఏండ్ల తర్వాత మ్యుటేషన్ చేశారు. తమకెందుకు చేయడం లేదంటూ మహేశ్వరం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లను ప్రశ్నించారు. అయితే ప్లాట్ల యజమానులను రెవెన్యూ సిబ్బంది కసురుకుంటున్నారని, ఇన్నాండ్లకు వస్తారా? అంటూ తిప్పి పంపిస్తున్నారని తెలిసింది. ఇదే క్రమంలో వ్యవసాయ భూములుగా కొనుగోలు చేసిన పెద్దోళ్లు ప్లాట్ల యజమానులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
Lభూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ప్లాట్లుగా మారిన ల్యాండ్‌ను రికార్డుల్లో నమోదు చేయలేదు. దాంతో పట్టాదారులకు పాస్ పుస్తకాలు వచ్చాయి. ధరణి పోర్టల్‌లో స్లాట్స్ బుక్ అవుతుండడంతో రిజిస్ట్రేషన్లు చేశారు. నేను వచ్చిన తర్వాత ఈ గ్యాలక్సీ టేక్ ప్లాంటేషన్ లే అవుట్ గురించి తెలిసి ట్రాన్సాక్షన్స్ నిలిపివేశాను. ఇప్పుడు చేయడం లేదు. గతంలో జరిగినవే. ఇటీవల ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే చెక్ చేస్తాను. 1,800 ప్లాట్ల వరకు ఉన్నాయన్న విషయం నాకు తెలియదు. అటు ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు పాస్ బుక్స్ ఉన్నాయి. దీనిపై ఏం చేయాలో నాకూ తెలియదు. అయితే ఏయే సర్వే నంబరులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో ఏమైనా వివరాలు ఉంటే వెరిఫై చేయిస్తాను.






