మహిళ బిల్లు వీగిపోవడం చీకటి రోజు : బీజేఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి

by Ramesh Naini |

పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

మహిళ బిల్లు వీగిపోవడం చీకటి రోజు : బీజేఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని, వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారత్​ను కాంగ్రెస్ మిత్ర పక్షాలు మర్చిపోతున్నాయని ఆరోపించారు. దేశంలోని ప్రతి మహిళ ఇండియా కూటమి వ్యవహారాన్ని మరిచిపోలేరని, నారి శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని దుయ్యబట్టారు. మహిళను ఆరాధించే సంస్కృతి భారతదేశానికి ఉందని, ఏడుసార్లు మహిళా బిల్లును ఓడించిన ఘనత కాంగ్రెస్‌ కే దక్కుతుందన్నారు.

దేశంలో కాంగ్రెస్‌ను ప్రజలు మర్చిపోతున్నారని, మహిళ బిల్లు విషయంలో దాని మిత్రపక్షాలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని పూర్తిగా చదవలేదని, పార్లమెంట్‌లో చేసిన చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఆయన రాజ్యాంగంలోని అంశాలను పూర్తిగా తెలుసుకోని మాట్లాడాలని హితవు పలికారు. మహిళా బిల్లు పాస్ అయితే సౌత్ ఇండియాకు మేలు జరిగేదని ప్రస్తావించారు. మహిళా బిల్లు విషయంలో ఇంటింటికి తిరిగి మహిళలకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు.

Next Story