సౌత్ తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ

by Elthuri vijay kumar |

స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పరిస్థితి మారలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సౌత్ తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ
X

సౌత్ తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ

ప్రజాప్రభుత్వంపై బాంబు పేల్చిన ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి

హెలికాప్టర్లలో వచ్చి మంత్రులు, అధికారులు రివ్యూలు

ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధికి మాత్రం నిధులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం

దిశ,గద్వాల క్రైమ్ : స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పరిస్థితి మారలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా దక్షిణ తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు. తాగునీరు, రోడ్లు, డ్రైన్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని దుస్థితిలో ప్రజలు ఉన్నారని ఆయన వాపోయారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల పురోగతి శూన్యం

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టులకు భూసేకరణ జరగకపోవడం, నీటి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం, కెనాల్స్ నిర్మాణం జరగకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. తమ సమస్యలను ఎన్నో రూపాల్లో ప్రభుత్వానికి తెలియజేసినప్పటికీ, మంత్రులు హెలికాప్టర్లలో వచ్చి రివ్యూలు చేసి వెళ్లడం తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. తాము ఇచ్చిన వినతిపత్రాలు కేవలం చిత్తు కాగితాలతో సమానంగా మారాయని, వాటిపై ఎక్కడా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముంపు గ్రామాల ప్రజల దీన గాథ

ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దురాల, జూరాల, రాలంపాడు రిజర్వాయర్ల కింద ఉన్న గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు కోల్పోయి నిలువ నీడ లేకుండా ఉన్నారని తెలిపారు. వారికి ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని, సరైన ఆర్థిక సహాయం అందడం లేదని చెప్పారు. వారి త్యాగాలకు విలువ లేకుండా పోయిందని, స్వంత రాష్ట్రంలో కూడా వారికి న్యాయం జరగడం లేదని అన్నారు.

మరిన్ని ప్రాజెక్టుల విస్తరణకు జీవోలు తెచ్చినా ఫలతం సున్నా..

కొత్తగా రాలంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలకు కొత్త జీవోలు జారీ అయ్యాయని, దీని ద్వారా రాలంపాడు సామర్థ్యం 15 టీఎంసీలకు, గట్టు సామర్థ్యం 4 నుంచి 5 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గతంలో గుడెం దొడ్డి రిజర్వాయర్‌కు కూడా 15 టీఎంసీల కోసం జీవో జారీ అయిందని, దానికి ఆర్థిక క్లియరెన్స్ కూడా వచ్చిందని చెప్పారు. కానీ, ఈ ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలైన భూసేకరణ, నీటి విస్తీర్ణం, సర్వే వంటివి ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు అతి చిన్నదని, దాని సామర్థ్యం 11 టీఎంసీలు కాగా, సిల్టప్ కారణంగా ప్రస్తుతం 8 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారని తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన రెండు ప్రధాన లిఫ్టుల గురించి ప్రస్తావిస్తూ, గుడెం దొడ్డి నుండి రాలంపాడుకు, ఆ తర్వాత గట్టు ఎత్తిపోతల పథకానికి నీరు వెళ్లేలా ఏర్పాటు చేశారని వివరించారు. ప్రస్తుతం రాలంపాడు రిజర్వాయర్ సామర్థ్యం 4 టీఎంసీలు కాగా, లీకుల కారణంగా కేవలం 2 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నింపగలుగుతున్నారని పేర్కొన్నారు. కింద ఉన్న చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి, తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని, అవి కూడా 1.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయగలుగుతున్నాయని అన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ప్రాజెక్టుల సమస్యలు మాత్రం పూర్తిగా పరిష్కారం కావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఆయన, తమ జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి తమ కష్టాలను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల పురోగతి, ముంపు గ్రామాల సమస్యలపై సమీక్షించి పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Next Story