మెగా డీఎస్సీ అప్‌డేట్.. అతి త్వరలోనే నిరుద్యోగులకు రేవంత్ సర్కారు శుభవార్త!

by Disha Web Desk 2 |
మెగా డీఎస్సీ అప్‌డేట్.. అతి త్వరలోనే నిరుద్యోగులకు రేవంత్ సర్కారు శుభవార్త!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. గతంలో గుర్తించిన సుమారు 5 వేల ఖాళీలకు అదనంగా మరో 5 వేల పోస్టులను కలపనున్నది. వైద్యాశాఖలోనూ మరో 5వేల ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గత రెండున్నర నెలల వ్యవధిలో దాదాపు పాతికవేల పోస్టులను భర్తీ చేసిన సర్కారు.. త్వరలో వీటిని భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్లు జారీ అవుతాయని ఆయా శాఖల అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.

ఉపాధ్యాయ పోస్టులపై ఫోకస్

మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖలో వివిధ స్థాయి అధికారులతో ఉపాధ్యాయుల పోస్టులపై ఆరా తీశారు. ఖాళీల వివరాలను అందించాలంటూ ఆదేశించారు. ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఖాళీ కానున్న పోస్టులను సైతం పరిగణనలోకి తీసుకుని లెక్కలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచేలా 2020లో నిర్ణయం తీసుకోవడంతో మూడేండ్లుగా రిటైర్‌మెంట్లు లేవు.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ విరమణలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ ఏడాది చివరికల్లా ఎంతమంది రిటైర్ అవుతారో వివరాలను సేకరించి పంపితే వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటివి, ఖాళీలను భర్తీ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే విద్యాశాఖలో ప్రస్తుత ఖాళీలతో పాటు డిసెంబరు వరకు ఖాళీ అయ్యే పోస్టుల సంఖ్య ప్రభుత్వానికి చేరింది. ఇప్పటికే గుర్తించిన సుమారు ఐదు వేల పోస్టులకు అదనంగా మరో ఐదు వేల పోస్టులు ఖాళీ అవుతుండడంతో మొత్తానికి ఒకేసారి మెగా డీఎస్సీని నిర్వహించి ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు మౌఖికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక నిర్దిష్ట పద్ధతిలో ప్రాసెసింగ్ మొదలుకావడమే తరువాయి.

వైద్యశాఖలోనూ మరో 5 వేలు

వైద్యారోగ్య శాఖలో ఇటీవలే సుమారు ఏడు వేల నర్సింగ్ ఆఫీసర్ల (స్టాఫ్ నర్స్) పోస్టుల సర్కారు భర్తీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొంతమందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఇకపైనా ఆ శాఖలో దాదాపు ఐదు వేల పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ రెండూ ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే విభాగాలు కావడంతో మెరుగైన సేవలు అందేందుకు అవసరమైన సిబ్బంది ఉండడం తప్పనిసరి అని భావించింది. డాక్టర్లు మొదలు నర్సింగ్ ఆఫీసర్ల వరకు వివిధ హోదాల్లో ఈ ఏడాది డిసెంబరు వరకు సుమారు ఐదు వేల పోస్టులు ఖాళీ అవుతాయని ఆ శాఖ అధికారులు లెక్క తేల్చారు. డిసెంబరు వరకూ ఆగకుండా వీలైనంత తొందరగా వీటికి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్, దాని ద్వారా భర్తీ చేయాలనుకున్న రెండు లక్షల పోస్టుల హామీని అమల్లోకి తేవడంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం, పరీక్షల నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

Next Story

Most Viewed