కొత్త రేషన్ కార్డులపై కసరత్తు మొదలు.. సాప్ట్‌వేర్‌లో మార్పులు!

by Disha Web Desk 2 |
కొత్త రేషన్ కార్డులపై కసరత్తు మొదలు.. సాప్ట్‌వేర్‌లో మార్పులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది. గతంలోని నిబంధనలు ఎలా ఉన్నా ఈసారి మాత్రం పటిష్టంగా పరిశీలించిన తర్వాతనే కొత్త కార్డులను మంజూరు చేయాలని భావిస్తున్నది. అధికాదాయ వర్గాలను వైట్ రేషన్ కార్డు పరిధి నుంచి మినహాయించేలా కొన్ని సవరణలకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం దరఖాస్తు చేసే సమయంలోనే స్క్రూటినీ జరిగేలా సాప్ట్‌వేర్‌లో సైతం మార్పులు చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్) అధికారులకు లేఖ రాసిన స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు ఆధార్ కార్డు, పాన్ నంబర్‌ను అనుసంధానం చేసేలా సూచనలు చేసినట్లు ఆ శాఖ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నది.

నిబంధనలు రూపొందిన తర్వాత..

కొత్త రేషను కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ‘మీ సేవ’ కేంద్రాలను ఆశ్రయిస్తున్నందున వారు వాడే సాఫ్ట్‌వేర్‌లో సైతం ఈ తరహా మార్పులు చేయాలని సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు భావిస్తున్నది. దరఖాస్తు దశలోనే అందులో పేర్కొన్న కుటుంబ వివరాల ఆధారంగా అర్హత ఉన్నదీ లేనిదీ ఫిల్టర్ చేయాలని అనుకుంటున్నది. నిర్దిష్టమైన నిబంధనలు రూపొందిన తర్వాత వాటికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగితే ఆదాయ పరిమితి, భూముల వివరాలు, ఆదాయపు పన్ను చెల్లింపు తదితరాలన్నీ తెలిసిపోతాయని, అర్హత ఉన్నదో లేదో అక్కడే తెలిసిపోతుందని సివిల్ సప్లైస్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో దరఖాస్తు చేసిన తర్వాత స్క్రూటినీ చేసే సమయంలో 360 డిగ్రీస్ విధానంలో అర్హత ఉన్నదీ లేనిదీ నిర్ధారణ అయ్యేదని, ఇప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపాయి.

వెలువడని అధికారిక ప్రకటన

అర్హత లేనట్లయితే వైట్ రేషన్ కార్డు రాదని, సంక్షేమ పథకాలకు అర్హత లేని రేషను కార్డు వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపాయి. ఈ నూతన విధానంతో తక్కువ సమయంలోనే అర్హులైనవారికి రేషన్ కార్డు పొందే అవకాశం ఉంటుందన్నది ఆ వర్గాల అభిప్రాయం. కొత్త రేషను కార్డుల కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. సివిల్ సప్లైస్ అధికారులకు సైతం ఎలాంటి ఆదేశాలూ రాలేదు. సిక్స్ గ్యారంటీస్ అందుకోవాలనుకునేవారు పాత కార్డుల అప్‌డేషన్‌తో పాటు కొత్త కార్డులు పొందడానికీ మీ సేవ కేంద్రాలు, రేషను దుకాణాల దగ్గర క్యూ కడుతున్నారు.

నిబంధనలకు త్వరలో సవరణలు

తెల్ల రేషన్ కార్డు పొందాలంటే ప్రభుత్వం గతంలోనే కొన్ని నిబంధనలను రూపొందించింది. గరిష్ట వార్షికాదాయ పరిమితి రూ.లక్ష.. ఫోర్ వీలర్‌లు ఉన్నవారు అర్హులు కారు.. ఆదాయపు పన్ను కట్టేవారూ అనర్హులు. మాగ్జిమమ్ భూ పరిమితి మూడున్నర ఎకరాలు.. ఇలాంటివి ఉండేవి. కొత్త దరఖాస్తులకు రైతుబంధు వివరాలను కూడా జోడించాలని భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే మంత్రివర్గంలో చర్చించి నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేయాలని సివిల్ సప్లైస్ డిపార్టుమెంటు భావిస్తున్నది. త్వరలో దీనిపై స్పష్టత రానున్నది. దారిద్ర్య రేఖకు దిగువ(బీపీఎల్)న ఉన్న వర్గాలను నిర్ధారించడానికి నిబంధనల్లో సవరణలు జరిగిన తర్వాత దానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరగనున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


Next Story

Most Viewed