డిస్కమ్‌‌లకు ఊపిరిలూదిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం నష్టాల గుదిబండ!

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు లాభాల్లోకి వస్తున్నా, తెలంగాణలో మాత్రం విద్యుత్ నష్టాలు 19.84 శాతానికి పెరిగాయి.

డిస్కమ్‌‌లకు ఊపిరిలూదిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం నష్టాల గుదిబండ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జాతీయ స్థాయిలో సత్ఫలితాలనిస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్), లేట్ పేమెంట్ సర్‌చార్జ్(ఎల్పీఎస్) నిబంధనలతో దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు కోలుకుంటున్నాయి. అయితే, దేశమంతా నష్టాల నుంచి గట్టెక్కుతున్న వేళ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. తాజాగా పార్లమెంటులో కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించిన గణాంకాలు తెలంగాణ విద్యుత్ రంగంలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

దేశవ్యాప్తంగా లాభాల్లోకి డిస్కమ్‌లు..

గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్ నష్టాలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. 2020-21లో 21.91శాతంగా ఉన్న మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ), 2024-25 నాటికి 15.04శాతానికి పడిపోయాయి. విద్యుత్ కొనుగోలు వ్యయానికి(ఏసీఎస్), వసూలవుతున్న ఆదాయానికి(ఏఆర్ఆర్) మధ్య ఉన్న అంతరం గతంలో యూనిట్‌కు రూ.0.69 ఉండగా, అది ఇప్పుడు కేవలం రూ.0.06కు తగ్గింది. ఈ క్రమశిక్షణ కారణంగానే చరిత్రలో తొలిసారిగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని డిస్కమ్‌లు మొత్తంగా రూ.2,701 కోట్ల నికర లాభాన్ని(ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) ఆర్జించాయి.

తెలంగాణలో రెట్టింపైన నష్టాలు..

దేశమంతా నష్టాల నుంచి గట్టెక్కుతుంటే.. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఆందోళనకరంగా మారింది. దేశ సగటు నష్టాలు తగ్గుతుంటే, తెలంగాణలో మాత్రం ఆ గ్రాఫ్ పెరుగుతూనే ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. 2021-22లో తెలంగాణలో ఏటీఅండ్‌సీ నష్టాలు 10.65శాతం ఉండగా, 2024-25 నాటికి అవి 19.84 శాతానికి పెరిగాయి. అంటే నాలుగేళ్లలో నష్టాలు దాదాపు రెట్టింపయ్యాయి. విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్‌పై తెలంగాణ డిస్కమ్‌లు నష్టపోతున్నాయి. 2024-25లో యూనిట్‌కు 27 పైసల లోటు(ఏసీఎస్-ఏఆర్ఆర్ గ్యాప్) నమోదైంది. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్(7.87శాతం), కేరళ(6.61శాతం) నష్టాలను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసి ఆదర్శంగా నిలిచాయి. విద్యుత్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. 2024-25లో విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రతి యూనిట్‌పై తెలంగాణ డిస్కమ్‌లు 27 పైసల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. దీనికి భిన్నంగా ఏపీలో యూనిట్‌కు 15 పైసలు, కేరళ 17 పైసలు, తమిళనాడు 19 పైసల లాభాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ విద్యుత్ రంగాన్ని లాభాల్లోకి మళ్లించగలిగాయి.

ఉత్తరాదిలో ఊహించని మార్పులు..

విద్యుత్ నిర్వహణలో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరుస్తాయనే పేరు ఉంది. కానీ తాజా నివేదిక ప్రకారం కొన్ని ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భారీ నష్టాల్లో ఉండే బిహార్(15.51శాతం), ఉత్తరప్రదేశ్ (19.54శాతం) వంటి రాష్ట్రాలు తమ నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. కేరళ, ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు కేంద్రం సూచించిన 15శాతం కంటే తక్కువ నష్టాలతో మేటిగా నిలుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ (46.20శాతం), నాగాలాండ్ (48.86శాతం) ఇప్పటికీ అత్యధిక నష్టాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అదనపు రుణ వెసులుబాటు(జీఎస్డీపీలో 0.5శాతం), లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనలు ఇతర రాష్ట్రాలకు వరంగా మారాయి.

మనకెందుకు రుణ వెసులుబాటు లేదు?

తెలంగాణలో విద్యుత్ నష్టాలు దేశ సగటు కంటే ఎక్కువగా 19.84 శాతానికి చేరడం, ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన సబ్సిడీ బకాయిలు సకాలంలో అందకపోవడం వంటివి కేంద్రం ఇస్తున్న రుణ వెసులుబాటుకు ప్రధాన అడ్డంకిగా మారాయి. కేంద్రం విధించిన కఠిన నిబంధనలు(వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వంటివి) అమలు చేయకపోవడంతో అదనపు రుణ వెసులుబాటును పూర్తిస్థాయిలో పొందలేని పరిస్థితి. దీనికి తోడు పాత బకాయిల ఈఎంఐలతో పాటు ప్రస్తుత నెలవారీ బిల్లుల చెల్లింపు భారంగా మారి, ఈ సంస్కరణలు రాష్ట్రానికి ఆశించిన మేర వరంగా మారడం లేదు. దేశవ్యాప్తంగా నష్టాలు సగటున 15 శాతానికి చేరగా.. తెలంగాణ ఇంకా 20 శాతం దరిదాపుల్లో ఉండటం ఆందోళనకరం. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, సకాలంలో సబ్సిడీ బకాయిల చెల్లింపు వంటి చర్యలు తీసుకోకపోతే తెలంగాణ డిస్కమ్‌ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

Next Story