పడకేసిన ఆడిట్ వ్యవస్థ.. ‘ధరణి’ లొసుగులే ఆసరాగా ‘స్టాంప్ డ్యూటీ’ స్కాం!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 02:19:12  IST  )

ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే తహశీల్దార్లు జాయింట్ రిజిస్ట్రార్లుగా మారారు. అప్పటి నుంచి లావాదేవీలను తనిఖీ చేసే ఆడిట్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది.

పడకేసిన ఆడిట్ వ్యవస్థ.. ‘ధరణి’ లొసుగులే ఆసరాగా ‘స్టాంప్ డ్యూటీ’ స్కాం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే తహశీల్దార్లు జాయింట్ రిజిస్ట్రార్లుగా మారారు. అప్పటి నుంచి లావాదేవీలను తనిఖీ చేసే ఆడిట్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. దస్తావేజులు సరిగ్గానే ఉన్నాయా? ప్రభుత్వం నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ కడుతున్నారా? అని పరిశీలించాల్సిన జిల్లా రిజిస్ట్రార్లు.. గత ఐదేళ్లుగా అటువైపు చూడడమే మానేశారు. ఈ పర్యవేక్షణ లోపాన్ని, ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న కొందరు.. అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ప్రారంభించారు. ‘స్టాంప్ డ్యూటీ’ స్కామ్ కూడా ఇందులో భాగమేననే చర్చజరుగుతున్నది. అయితే అదే పరంపర భూ భారతి వెబ్ సైట్ అమల్లోకి వచ్చినా కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. అసలు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు రెవెన్యూ శాఖకు అప్పగించడంతో మొదలైన ఈ దందాలో.. ఇంకెన్ని రూ.కోట్లు కొల్లగొట్టారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమాలకు సహకరించిన తెర వెనుకున్న అధికారులపై యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

కన్నెత్తి చూడని జిల్లా రిజిస్ట్రార్లు..

ధరణి పోర్టల్ రాకముందు భూ దస్తావేజుల పని, బాధ్యతలు, అధికారాలన్నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవే. రిజిస్ట్రేషన్ల చట్టం-1908 ప్రకారం వాళ్లు విధులు నిర్వహించేవారు. భూ క్రయ విక్రయాలకు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అధికారిగా వ్యవహరించేవారు. తమ పరిధిలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను తనిఖీ చేసి ర్యాండమ్ గా రిజిస్ట్రేషన్ దస్తావేజులను పరిశీలిస్తారు. స్టాంప్ డ్యూటీ, లెవీ తక్కువగా చూపిస్తే క్షేత్ర స్థాయిలోనూ పరిశీలించే అధికారం ఉంది. స్టాంప్ డ్యూటీ తక్కువగా వేస్తే పెనాల్టీతో సహా సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేస్తారు. జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అధికారుల పనితీరును రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, ఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. అయితే గత ప్రభుత్వం 2020 సెప్టెంబరు 28న ధరణి చట్టం అమల్లోకి తీసుకొచ్చి.. జీవో 116 ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహశీల్దార్లకు కట్టబెట్టింది. అప్పటి నుంచి జిల్లా రిజిస్ట్రార్లు అటువైపు వైపు కన్నెత్తి చూడలేదు. తహశీల్దార్లు రెవెన్యూ శాఖ కాబట్టి.. తామేలా ఆడిట్ చేయాలని జిల్లా రిజిస్ట్రార్లు అంటున్నారు.

అమ్మకాలను ‘గిఫ్టు’లుగా మార్చి..

సాధారణంగా భూమి క్రయ విక్రయాల్లో స్టాంప్ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తసంబంధీకులకు గిఫ్ట్ డీడ్ చేస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని బయటి వ్యక్తులను కూడా బంధువులుగా మార్చి కొందరు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్లు తెలుస్తున్నది. అయితే సరైన స్టాంప్ డ్యూటీ వచ్చిందా లేదా అన్నది జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

నోటిఫై కాకుండానే రిజిస్ట్రేషన్లు..

హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్, మేడ్చల్ జిల్లాలోని బాలానగర్, కూకట్ పల్లి తహశీల్దార్లను మినహాయించి.. అందరినీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నోటిఫై చేశారు. జీవో ప్రకారం కూకట్ పల్లి తహశీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కాకపోయినా.. శంషీగూడలోని సర్వే నం.57లో అనేక రిజిస్ట్రేషన్లు చేశారని, లేని అధికారాన్ని వినియోగించుకొని ఏ విధంగా సేల్ డీడ్స్ చేశారో అంతుచిక్కడం లేదని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ ‘దిశ’కు వివరించారు. ఆ ఏడాది ఆడిట్ చేసి ఉంటే ఈ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ వెలుగులోకి వచ్చేవని అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్లకే కొందరు తహశీల్దార్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర రెవెన్యూ విధులను పట్టించుకోకపోవడంతో దరఖాస్తులు పేరుకుపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు సేల్ డీడ్, పార్టిషన్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్ గేజ్లకే పరిమితం చేశారు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాల దస్తావేజులను చేసే అధికారాన్ని తహశీల్దార్లకు కట్టబెట్టారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలు, ఇతర ఫీజులు మొత్తం కలుపుకొని చలానా ద్వారా అమౌంట్ చెల్లిస్తారు. ఐతే క్లాసిఫికేషన్ ను బట్టి స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు. ఇందులోనే లొసుగులను ఆధారంగా చేసుకొని పెద్ద మొత్తంలో నొక్కేస్తున్నా గుర్తించలేకపోయారు. ఇదంతా ఆడిట్ ఎప్పటికప్పుడు చేసి ఉంటే లోపాలను సరిదిద్దేందుకు అవకాశం లభించేదని సురేష్ పొద్దార్ అన్నారు.

వ్యవసాయ భూములపై ఆడిట్ జరగాలి..

ఎవరు దస్తావేజులు చేసినా.. రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీ, ఐజీ పర్యవేక్షణలో జరగాలి. ఐతే గడిచిన ఐదేండ్లుగా ఇదే విషయాన్ని కొందరు సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ట్రాన్సాక్షన్స్ ఆడిట్ చేస్తున్నారే తప్పా.. అగ్రికల్చర్ ల్యాండ్స్ పై దృష్టి పెట్టడం లేదని సబ్ రిజిస్ట్రార్ల సంఘం నాయకుడొకరు ‘దిశ’కు వివరించారు. ఈ అంశంపై చాలా రోజులుగా ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఏ శాఖ చేసే పని, ఆ శాఖకే అప్పగించడం ద్వారానే మేలైన సేవలందుతాయన్నారు. ఆటోమెటిక్ మ్యుటేషన్ పేరిట తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ సబ్ రిజిస్ట్రార్లు చేసిన దస్తావేజులకు అనుగుణంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండ్లు, ప్లాట్లు కూడా ఆటోమెటిక్ మ్యుటేషన్లు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

అర్ధరాత్రి ట్రాన్సాక్షన్స్..

ధరణి పోర్టల్ అమల్లో ఉన్న రోజుల్లో నిషేధిత భూముల జాబితాలోని ల్యాండ్స్ కి రిజిస్ట్రేషన్లు చేశారు. పీవోబీలో నుంచి డెలీట్ చేయడం, వెంట వెంటనే సేల్ డీడ్, మ్యుటేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏం తెలియనట్లుగా పీవోబీలో నమోదు చేశారు. ఇలాంటివి రంగారెడ్డి జిల్లా గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ అర్ధరాత్రి చోటు చేసుకున్న ట్రాన్సాక్షన్స్ లోని ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ విలువ ఎకరం రూ.కోట్లల్లోనే ఉంటుంది. మరి దానికి తగ్గట్లుగా స్టాంప్ డ్యూటీ చెల్లించారా? చలాన్లు ఆ రాత్రి సమయంలో ఎలా రూపొందించారు? ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్న ప్రభుత్వం ఈ ట్రాన్సాక్షన్స్ లోని చలాన్లు, సేల్ డీడ్స్ ని పరిశీలిస్తే మరిన్ని లోపాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.

నేడు అన్ని జిల్లాల్లో స్టాంప్ డ్యూటీ లెక్కల పరిశీలన..

జనగామ ఉదంతాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకున్నది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. నేడు (సోమవారం) అన్ని జిల్లాల్లో భూ క్రయ విక్రయాలు, స్టాంప్ డ్యూటీ లెక్కలు చూసే పనిని చేపట్టింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ర్యాండమ్ గా డాక్యుమెంట్లు, వాటిలోని విస్తీర్ణం, స్టాంప్ డ్యూటీని చెక్ చేయనున్నట్లు తెలిసింది. కొందరు కలెక్టర్లు మాత్రం కలెక్టరేట్లలోనే తహశీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

Next Story