- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌లో సామాజిక న్యాయం లేదన్న గువ్వల బాలరాజు.. తాటికొండ రాజయ్య ఫైర్
కాళేశ్వరం 22 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టు అని.. దానికి అన్ని అనుమతులూ ఉన్నాయని.. కూలిందంటూ కాంగ్రెస్ నేతలు కావాలని ప్రచారం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం 22 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టు అని.. దానికి అన్ని అనుమతులూ ఉన్నాయని.. కూలిందంటూ కాంగ్రెస్ నేతలు కావాలని ప్రచారం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అనుమతులు లేని తుమ్మిడిహెట్టిని కట్టి తీరుతామని ఉత్తమ్ అంటున్నారని.. అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి పూర్తి కావాలంటే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవాలని.. దాని గురించి ఉత్తమ్ మాట్లాడటం లేదని పేర్కొన్నారు. రేవంత్ తన గురువు చంద్రబాబు ఎజెంట్‌గా, బినామీగా పనిచేస్తూ కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని, బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లను బీఆర్ఎస్ అంగీకరించదన్నారు.
ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అవసరమైతే ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిస్తుందని స్పష్టం చేశారు. దేవాదులను పూర్తిచేయకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయం పాటించడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని.. గువ్వల బాలరాజు వ్యాఖ్యలు సరికాదని అన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క సమ్మక్క-సారక్క బ్యారేజీని సందర్శించారని.. ఓ సబ్ స్టేషన్ ప్రారంభం తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలోనే సమ్మక్క బ్యారేజీ 90 శాతం పనులు పూర్తయ్యాయని.. ఇంకా పది శాతం పనులు 20 నెలలు గడిచినా పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు. దేవాదుల దగ్గర నీళ్లు లేకపోవడంతో కేసీఆర్ రీ ఇంజినీరింగ్ చేసి సమ్మక్క-సారక్క బ్యారేజ్ నిర్మించారని చెప్పారు. ఇక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారని.. దానిపైనా ఏ పురోగతీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వాకంతో సమ్మక్క-సారక్క బ్యారేజీ యంత్ర సామగ్రి పాడవుతున్నదని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురు మంత్రుల పర్యటనతో ఒరిగిందేమీ లేదన్నారు. ఒక్కరోజు ఖర్చు రూ.50 లక్షలు వృథా అయ్యాయని.. మంత్రులు కేవలం విహంగ వీక్షణానికే పరిమితమయ్యారని ఆరోపించారు. దేవాదుల కింద 20 నెలల కాంగ్రెస్ పాలనలో చెంచాడు మట్టి కూడా తీయలేదన్నారు. కుట్రతో కాళేశ్వరం కింద మేడిగడ్డ పంపులు ఆన్ చేయడం లేదన్నారు. ఈ సమస్యను సమీక్షించే ఓపిక సీఎం, మంత్రి ఉత్తమ్‌కు లేదా? అని ప్రశ్నించారు. కన్నె పల్లి పంప్ హౌజ్ వద్ద మోటార్లు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇంజినీర్లు ప్రభుత్వానికి రాసిన లేఖ తమ దగ్గర ఉందని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ లేఖను తామే బయటపెడతామని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను గ్రామాల పొలిమేరల నుంచే తరిమే పరిస్థితి రాక మానదని హెచ్చరించారు.






