చికోటి ప్రవీణ్ థాయిలాండ్ ఎందుకు వెళ్లినట్టు.. థాయ్ మసాజ్ అంటే అంత పిచ్చి దేనికి?

by Disha Web Desk 2 |
చికోటి ప్రవీణ్ థాయిలాండ్ ఎందుకు వెళ్లినట్టు.. థాయ్ మసాజ్ అంటే అంత పిచ్చి దేనికి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు యువతకు ఎంజాయ్​మెంట్ అంటే గోవా.. మద్యం, సముద్రం కాంబినేషన్‌లో సేద తీరేవారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి మద్యం, సముద్రంతోపాటు మగువతోడు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి వారిలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తున్నది. సెక్స్​టూరిజానికి అనుకూలంగా ఉన్న విదేశాలను ఎంచుకుంటున్నారు. ఈక్రమంలో వారికి థాయ్​లాండ్​స్వర్గధామంలా మారింది. సెక్స్​టూరిజానికి థాయ్​లాండ్‌లోని పట్టాయ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ఇండియానుంచి 4,5 గంటల్లోనే చేరుకోవడంతోపాటు అక్కడి కరెన్సీ 1:2.40 ఉండటంతో యువత ఆసక్తి చూపుతున్నారు. థాయ్‌లాండ్ అనగానే చాలామందికి మసాజ్ గుర్తుకొస్తుంది. యూత్‌ మాత్రం ‘శాండ్‌విచ్ మసాజ్’ డైలాగ్‌ను గుర్తుచేస్తారు. ఇటీవల సినిమాల్లో ఇది బాగా ట్రెండింగ్ అయింది. స్పా, ఫిమేల్ టు మేల్ మసాజ్, గాంబ్లింగ్, కాసినో, డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. యూరోపియన్ దేశాల్లోని టూరిజం స్పాట్‌లను సందర్శించడం ఖర్చుతో కూడుకున్ వ్యవహారం కావడంతో థాయ్‌లాండ్‌కు దక్షిణాసియా దేశాల నుంచి డిమాండ్ పెరిగింది. థాయ్‌లాండ్ టూర్ అనగానే పురుషులు బ్యాచ్‌లర్‌గానో, కొద్దిమంది ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లడమే ఠక్కున గుర్తుకొస్తుంది. హయ్యర్ మిడిల్ క్లాస్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

థాయ్ మసాజ్‌.. ప్రత్యేక గుర్తింపు

థాయ్‌లాండ్ మసాజ్ అనగానే యూత్‌కు ఒక క్రేజీ. వెంటనే గుర్తుకొచ్చేది పట్టాయా ప్రాంతం. నలుగురైదుగురు కలిసి టీమ్‌గా హాలీడే ట్రిప్ వేస్తున్నారనగానే వెంటనే స్పా, ఫిమేల్ టు మేల్ మసాజ్ గుర్తుకొస్తుంది. అక్కడ ఓ వీధిలో చూసినా మసాజ్​ పార్లర్లే దర్శనమిస్తాయి. యూరప్​, రష్యా, కెనడా దేశాలకు చెందిన మహిళలతో మసాజ్​ చేయిస్తామని పార్లర్ల ఎదుట బోర్డులు కనిపిస్తాయి. ఈ దేశంలో వ్యభిచారం నేరమే అయినా, చాలామంది ఇల్లీగల్​గా ఈ దందా నడిపిస్తుంటారు. పట్టాయాలో రాత్రి 9 గంటలనుంచే వీధుల్లోకి యువతులు వచ్చి విటులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆ దేశంలో వ్యభిచారం తీవ్రమైన నేరం.. గరిష్ఠంగా 20ఏండ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయినా, పర్యాటకంపైనే ఆ దేశం ఆధారపడి ఉండటంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, ఆ దేశ ప్రాచీన ఆరోగ్య సూత్రాల్లో మసాజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అది సంప్రదాయ వైద్యం కూడా. కేవలం మసాజ్ మాత్రమే కాక ఆక్యుప్రెషర్, యోగ లాంటివి కూడా కలగలిసి ఉంటుంది. మసాజ్‌కు ఉన్న గుర్తింపు రీత్యా ఆ దేశ ప్రభుత్వం దీన్ని ఒక ఇండస్ట్రీగానే పరిగణించి వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉంచింది.

థాయ్ మసాజ్ మజాలో యూత్

హాట్ స్టోన్, అరోమా థెరపీ, స్వీడిష్, డీప్ టిష్యూ, స్పోర్ట్స్, షియాట్సు, కపుల్స్, చైర్.. ఇలాంటి పేర్లతో ఎన్ని రకాల మసాజ్‌లు ఉన్నా థాయ్ మసాజ్ అనేదే ఫేమస్. చివరకు ఇది సెక్స్ మసాజ్‌గా మారింది. దీని కోసమే సౌత్ ఈస్ట్ దేశాల నుంచి టూరిస్టుల పేరుతో తరచూ పట్టాయాకు వెళ్ళడం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బిజినెస్‌మెన్, పొలిటీషియన్లు ప్రతీ సంవత్సరం హాలీడే ట్రిప్ పేరుతో థాయ్‌లాండ్ వెళ్తూ ఉంటారు. అక్కడి థాయ్ మసాజ్ రుచి చూస్తారు. దానికి సెక్స్, వ్యభిచారం అనే రకరకాల పేర్లు ఉన్నా థాయ్ మసాజ్ అనే పేరుతోనే పాపులర్. వ్యభిచారం చట్టబద్ధత సంగతి ఎలా ఉన్నా ఆ దేశంలో ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. టూరిజం రంగం నుంచే ఆ దేశానికి సగం ఆదాయం సమకూరుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పర్యాటక రంగాన్ని ఆ దేశ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తూ ఉన్నది.

గ్యాంబ్లింగ్, కాసినోకు కేరాఫ్ అడ్రస్

థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్, కాసినోలపై అధికారికంగా నిషేధం ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తూనే ఉంటాయి. కేవలం గుర్రపు పందాలు, లాటరీలకు మాత్రమే లీగల్. మిగిలినవన్నీ ఇల్లీగల్. ఒకప్పుడు దీని కోసమే విదేశాల నుంచి ఎక్కువగా వస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం కొన్నేండ్ల పాటు గ్యాంబ్లింగ్, కాసినోలను చట్టబద్దం చేసింది. ఊహించనంతగా రెవెన్యూ పెరిగింది. కానీ ఆ దేశ పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ విరమించుకున్నది. కరోనా సమయంలో పర్యాటక రంగం బాగా దెబ్బతిని ఆదాయ వనరులు పడిపోవడంతో గ్యాంబ్లింగ్, కాసినోలను మళ్లీ లీగల్ చేయాలనే చర్చ మొదలైంది. త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల చీకోటి ప్రవీణ్‌తో పాటు 80 మంది అక్కడికి వెళ్లి పట్టుబడింది కూడా ఈ కారణంగానే.

తక్కువ ఖర్చుతో ఎంజాయ్‌మెంట్

మన దేశం నుంచి కేవలం నాలుగైదు గంటల్లోనే అక్కడికి ఫ్లైట్ ద్వారా వెళ్ళొచ్చు. టికెట్‌ ధర పాతిక వేలే. టూరిస్టు వీసాకు కూడా పెద్దగా చిక్కుల్లేవ్. ఆర్థిక స్తోమతకు తగినట్లుగా రెండు వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు మసాజ్‌ సర్వీస్ దొరుకుతుంది. రిసార్టులు, హోటళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. పల్లె ప్రజలు పట్నాలకు వెళ్తే.. మెట్రో సిటీస్ నుంచి గోవాకు వెళ్తుంటారు. మరికొంత ఆర్థిక స్థోమత ఉంటే గతంలో శ్రీలంక లాంటి ప్రాంతాలకు వెళ్ళేవారు. కానీ ఈ మధ్యకాలంలో థాయ్‌లాండ్ వైపు చూపు మళ్ళింది. సినిమా షూటింగుల్లో అక్కడి ప్రకృతి సౌందర్యాలు, బీచ్‌లు, రిసార్టులను చూపించడం కూడా ఇందుకు ఒక కారణం. సాకులు ఏవి చూపించినా చివరకు మసాజ్ మజాయే వారిని థాయ్‌లాండ్‌కు తీసుకెళ్తున్నది. ఇందులో శాండ్​విచ్​, సోపీ మసాజ్​ 5వేల నుంచి 10వేల థాయ్​ బాత్​ల వరకు వసూలు చేస్తారు. ఇక ఫుట్​, హెడ్​ మసాజ్​లు 200 తీసుకుంటారు.

లోకల్ యూత్‌కు డ్రగ్స్ భూతం

థాయ్‌లాండ్‌లో డ్రగ్స్ ఉత్పత్తి లేకపోయినప్పటికీ పొరుగున ఉన్న మయన్మార్, లావోస్ దేశాల నుంచి దిగుమతి అవుతూ ఉన్నది. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న పేద యువత ఈ వ్యసనం బారిన పడుతున్నట్లు గుర్తించిన అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా డీఅడిక్షన్ సెంటర్లను నెలకొల్పింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ వ్యసనానికి గురికావడంతో వారి కుటుంబాలకు మాత్రమే కాక దేశ ఎకానమీకే సవాలు మారిందని భావిస్తున్నది. నేరాలు పెరిగిపోతున్నాయని, హింసాత్మక చర్యలకు దారితీస్తున్నదని, ఒక దశలో చిన్న ఆయుధాలను వాడి లంపెన్‌గా తయారవుతున్నారని ప్రభుత్వం ఆందోళన పడింది. చివరకు పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు ద్వారా డీ-అడిక్షన్ సెంటర్లను పెట్టి కౌన్సిలింగ్ ద్వారా పూర్తిగా రూపుమాపే చర్యలకు శ్రీకారం చుట్టింది.

సింహభాగం టూరిజం, హోటల్ ఇండస్ట్రీ నుంచే

సముద్ర తీరప్రాంతం ఉన్న థాయ్‌లాండ్‌కు ఎగుమతి-దిగుమతి రంగాలతో పాటు రిసార్టులు, హోటళ్ళు, టూరిజం లాంటివన్నీ ప్రధాన ఆదాయ వనరులు. చేపలు, టింబర్ ఎగుమతి కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం. దట్టమైన అడువులు, బీచ్‌లు ఉండడంతో టూరిజం రంగం ద్వారానే దాదాపు ఐదో వంతు ఆదాయం సమకూరుతున్నది. థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, ఆయుత్తయా, చియాంగ్‌మై, క్రాబి, కాంచనబరి, కో తావో, కో ఫంగన్ లాంటి ప్రముఖ నగరాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. ఏటా దాదాపు 12 ట్రిలియన్ బాట్‌ (ఆ దేశ కరెన్సీ) టూరిజం ద్వారానే వస్తున్నది. దక్షిణాసియా దేశాల నుంచి ఏటా సగటున మూడు కోట్ల మందికి పైగానే థాయ్‌లాండ్‌ను సందర్శిస్తూ ఉంటారు.

సర్వీస్, ఇండస్ట్రీ రంగాలు కీలకం :

సుమారు ఏడు కోట్ల జనాభా ఉన్న థాయ్‌లాండ్‌లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి ఉంటుంది. నిరుద్యోగం అనే సమస్యే లేదు. దేశం మొత్తం ఎకానమీలో 52% సర్వీసు సెక్టార్ నుంచి వస్తున్నది. టూరిజం, హోటళ్ళు, స్పా, మసాజ్ లాంటివాటి ద్వారా. ఆ తర్వాతి స్థానం పారిశ్రామిక రంగా (44%)నిదే. ఆ దేశంలో చీప్ లేబర్ కావడంతో ఇతర దేశాలకు చెందిన శాంసంగ్, ఎల్‌జీ తదితర కంపెనీలు ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ పరిశ్రనలను నెలకొల్పాయి. మరికొన్ని దేశాల కార్ల తయారీ కంపెనీలు ఆటోమొబైల్ యూనిట్లను నెలకొల్పాయి. కొంతకాలం తర్వాత వియత్నాంలో మరింత చీప్‌గా కార్మికులు దొరుకుతుండడంతో అక్కడికి షిప్ట్ అయ్యాయి.

హార్డ్​వేర్ ఉత్పత్తిలో మేటి

కంప్యూటర్లలో మనం వాడే కాంపొనెంట్లు, సీగేట్ హార్డ్ డిస్కులు, వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్కుల లాంటివన్నీ థాయ్‌లాండ్‌లో ఉత్పత్తి అవుతున్నవే. దాదాపు 8 లక్షల మంది పనిచేసే ఈ రంగం ఆ దేశ ఎకానమీలో 15%. చైనా తర్వాత హార్డ్ డిస్కులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం థాయ్‌లాండ్. ఇక్కడి నుంచి దక్షిణాసియా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఆటోమొబైల్ రంగం సైతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం.

Read more:

అందరి ముందు ప్యాంటు విప్పమన్నారు.. ఎయిర్ లైన్స్‌పై నటి ట్వీట్ వైరల్



Next Story

Most Viewed