‘టాస్క్‌ఫోర్స్ వాళ్లు తిరుగుతున్నరు.. నాకేం సంబంధం లేదు’ మాఫియా డాన్ ఆడియో వైరల్

by Disha Web Desk 4 |
‘టాస్క్‌ఫోర్స్ వాళ్లు తిరుగుతున్నరు.. నాకేం సంబంధం లేదు’ మాఫియా డాన్ ఆడియో వైరల్
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : నిత్యం ప‌దుల సంఖ్యలో లారీలు, అదే స్థాయిలో ట్రాలీలు, వాహ‌నాలు, పెద్ద ఎత్తున బియ్యం అక్రమ ర‌వాణా, కోట్లలో వ్యవ‌హారం... మ‌హారాష్ట్రలోని సిర్వంచ‌లో డెన్ ఏర్పాటు చేసుకుని తెలంగాణ‌లో పెద్ద ఎత్తున బియ్యం అక్రమ ర‌వాణా చేస్తున్న డాన్ త‌న క‌నుస‌న్నల్లో వ్యాపారాన్ని న‌డిపిస్తున్నాడు. ప‌ది జిల్లాల పోలీసులు, అధికారులు ఆయ‌న చెప్పిన‌ట్లే న‌డుచుకుంటారు. పోలీసులు, అధికారులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతున్నాయి....? ఏం చేస్తున్నారు... ఇలా స‌మాచారం అంతా అత‌ని చేతిలో ఉంటుంది.

తెలంగాణ‌లో పేద‌ల‌కు చెందాల్సిన చౌక బియ్యం పెద్ద ఎత్తున ప‌క్కదారి ప‌డుతోంది. అధికారులు, పోలీసుల నిఘా, నియంత్రణ కొరవడడంతో ఈ బియ్యం జోరుగా ర‌వాణా సాగుతోంది. తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల నుంచి బియ్యం మ‌హారాష్ట్రలోని స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన సిర్వంచకు వెళ్తున్నాయి. అక్కడ డెన్ ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి ఈ బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. ఈ వ్యవహారంలో అధికారుల వైఫల్యం ప్రముఖపాత్ర పోషిస్తుండగా తెలివిన మీరిన స్మగ్లర్లు కూడా రోజుకో రకమైన వ్యూహంతో చౌక బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంటుకు సవాలు విసురుతున్నారు. చిన్న చిన్న ఆటోలు, గూడ్స్‌ క్యారియర్స్‌లో ఐదు క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్లు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుండ‌గా, ప‌దుల సంఖ్యలో లారీల ద్వారా సైతం బియ్యం ర‌వాణా సాగుతోంది.

దళారులతో మహారాష్ట్రకు చేరవేత

ఈ పీడీఎస్ బియ్యాన్ని దళారులు గ్రామాల్లో తిరుగుతూ లబ్ధిదారుల నుంచి కిలో రూ.8నుంచి రూ.12వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం పరిమాణం పెరగగానే క్వింటాళ్ల చొప్పున అక్రమ రవాణా చేసి తెలంగాణ సరిహద్దు ఉన్న మహారాష్ట్రలోని సిర్వంచ‌కు త‌ర‌లిస్తున్నారు. అక్కడ క్వింటాకు రూ.2,100 నుంచి రూ. 2,500 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్ర‌మ ర‌వాణా సాగుతుండ‌గా, అధికారులు, పోలీసులు మౌనం వ‌హించ‌డం ఏమిట‌నే ప్రశ్నలు త‌లెత్తుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా సిర్వంచ‌లో బియ్యం వ్యాపారం చేస్తున్న మాఫియాడాన్ చాలా జిల్లాల్లో వారిని త‌న చెప్పు చేత‌ల్లో ఉంచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఎక్కడైనా ఎవ‌రైనా ప‌ట్టుకుంటే చాలు... ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి చేయించి వాహ‌నాలు విడిపించుకుంటున్నాడు.

ప‌ట్టుకుంటే సంబంధం లేదు..

అయితే, తాజాగా ఆ మాఫియా డాన్ త‌న ప‌రిధిలో ఉన్న బియ్యం వ్యాపారుల‌కు జారీ చేసిన హెచ్చరిక‌లు, ఆడియో క్లిప్పులు ‘దిశ’ చేతికి చిక్కాయి. ఈ డాన్ త‌న ప‌రిధిలో బియ్యం వ్యాపారుల‌తో క‌లిపి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టడంతో పాటు ఆడియో ద్వారా వారికి స‌మాచారం పంపించారు. హైద‌రాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ బృందాలు తిరుగుతున్నాయని వారు ప‌ట్టుకుంటే మాకెలాంటి సంబంధం లేదంటూ ఆయ‌న హెచ్చరించారు. ''వ్యాపారస్తుల‌కు తెలియజేయినది ఏమనగ నేటీ నుండి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే మాకు ఏలాంటి సంబంధం లేద‌ంటూ’ ఆయ‌న వారికి స‌మాచారం చేర‌వేశారు. ప్రభుత్వం ఈ రేష‌న్‌బియ్యం అరిక‌ట్టేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ బృందాల‌ను ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆ డాన్ ఈ హెచ్చరిక‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న‌కు స‌మాచారం ఎలా అందుతోంది..

అయితే, ఈ వ్యవ‌హారంలో ఆ డాన్‌కు స‌మాచారం ఎలా అందుతుంద‌నేది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ నుంచి వ‌చ్చే టాస్క్‌ఫోర్స్ బృందం ర‌హ‌స్యంగా వ‌చ్చి దాడులు చేస్తుంది. అలాంటిది ఆ డాన్‌కు ముందుగానే స‌మాచారం చేర‌వేసింది ఎవ‌ర‌నేది ప్రశ్నార్థకంగా మారింది. బియ్యం అక్రమ ర‌వాణా చేస్తున్న ఆయ‌న అధికారుల‌కు, పోలీసుల‌కు ముట్టజెప్పేదే ప్రతి నెలా ల‌క్షల్లో ఉంటుంది... అలాంటిది ఆయ‌న‌కు స‌మాచారం అందడం పెద్ద విష‌యం ఏమి కాద‌ని పోలీసు డిపార్ట్‌మెంట్లోనే కొంద‌రు చెబుతున్నారంటే ప‌రిస్థితి అర్దం చేసుకోవ‌చ్చు. ఇక‌, ఆయ‌న వ్యాపారస్థుల‌కు పంపిన మెసేజ్‌లోనే స్థానికంగా ఎవ‌రైనా బియ్యం ప‌ట్టుకుంటే త‌న స‌హ‌కారం ఉంటుంద‌ని భ‌రోసా సైతం ఇవ్వడం ప‌ట్ల ప‌లువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యం అక్రమ ర‌వాణా వ్యవ‌హారంలో కోట్లలో జ‌రుగుతున్న ఈ వ్యవ‌హారాన్ని అరిక‌డుతుందా..? లేదా..? ఆ మాఫియా డాన్ వ్యవ‌హారాన్ని తుద ముట్టిస్తుందా..? లేదా..? అన్నది చూడాలి.

Next Story

Most Viewed