టీజీఎస్ఆర్టీసీలో కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ రద్దు

by Naga Rani Yarlagadda |

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులకు ఇస్తోన్న కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ ను యాజమాన్యం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

టీజీఎస్ఆర్టీసీలో కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు అందుతున్న కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను యాజమాన్యం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 17, 2026 నుండి ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఉద్యోగులకు లేదా వారి భాగస్వాములకు పర్సనల్ పే' రూపంలో ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో ప్రారంభమైన ఈ పథకం.. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీజీఎస్ఆర్టీసీలో కొనసాగుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2006లోనే తన ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్‌ను రద్దు చేసింది. ఇప్పుడు ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రోత్సాహక ఇంక్రిమెంట్‌ను రద్దు చేసినప్పటికీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే ఉద్యోగులకు ఇచ్చే స్పెషల్ క్యాజువల్ లీవ్ (ప్రత్యేక సాధారణ సెలవు) సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని యాజమాన్యం స్పష్టం చేసింది. సుమారు మూడు దశాబ్దాల కాలంగా ఇస్తున్న కుటుంబ నియంత్రణ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ ను యాజమాన్యం ఏకపక్షంగా రద్దు చేయడానికి టీజీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

Next Story