టీజీఐఆర్‌డీ పోస్టింగ్‌ల కోసం అధికారుల పైరవీలు

by Naga Rani Yarlagadda |

రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజీఐఆర్‌డీ) పంచాయతీరాజ్ అధికారులకు పునరావాస కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీజీఐఆర్‌డీ పోస్టింగ్‌ల కోసం అధికారుల పైరవీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(టీజీఐఆర్‌డీ) పంచాయతీరాజ్ అధికారులకు పునరావాస కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో పోస్టింగ్ పొందాలనుకునే అధికారులు రాజకీయ పరిచయాలు, ఉన్నతాధికారుల సహకారం ద్వారా టీజీఐఆర్‌డీలో నియామకాలు పొందుతున్నారని ఇతర అధికారులు చెబుతున్నారు. ఇక్కడ జాయింట్ డైరెక్టర్ (జేడీ), డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) స్థాయి అధికారులతో పాటు జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు), డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. పదోన్నతులు పొందిన అధికారులు కుటుంబ అవసరాలు, పిల్లల చదువు వంటి కారణాలు చూపుతూ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోం ది. టీజీఐఆర్‌డీలో చాన్స్ రాకపోతే కొందరు సెర్ప్‌లో, లేకపోతే పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం లేదా ఇతర శాఖల్లో పోస్టింగ్‌లు పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పని ఒత్తిడి తక్కువగా ఉండటం, పర్యవేక్షణ పరిమితంగా ఉండటం వల్ల పోస్టింగ్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అవి చాలా అరుదుగా జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రస్థాయి అధికారులకు తగినంత పని లేకపోవడం కూడా సమస్యగా మారింది. టీజీఐఆర్‌డీకి అనుబంధంగా ఉన్న ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్లు (ఈటీసీలు)లోనూ అధికారులు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో ఐఆర్‌డీ, ఈటీసీలు పునరావాస కేంద్రాలుగా మారాయని విమర్శలు ఉన్నాయి. ఇక కింది స్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయితే ఉన్నతస్థాయి పోస్టుల్లో అధిక సంఖ్యలో అధికారులు ఉండటం గమనార్హం. జాయింట్ డైరెక్టర్ స్థాయిలో డజనుకు పైగా అధికారులు, గ్రూప్-1 కేడర్ ఎంపీడీవోలు కూడా గణనీయంగా ఇక్కడే పనిచేస్తున్నారు. జిల్లాల్లో విధులు నిర్వహించాల్సిన వారు హైదరాబాద్ పోస్టింగ్ కోసం పైరవీలు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ విమర్శలను పంచాయతీరాజ్ అధికారులు ఖండిస్తూ, తమ శాఖకు సంబంధించిన విధుల్లోనే తాము పనిచేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.

Next Story