TG Govt.: పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్.. మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లకు టెండర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-18 03:10:49  IST  )

TG Govt.: పారిశ్రామిక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్.. మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లకు టెండర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పారిశ్రామిక పార్కులకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు వచ్చేలా చూస్తున్న సర్కారు.. ఇప్పటికే కేటాయించిన పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పలు పారిశ్రామిక పార్కుల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసమే రూ.వంద కోట్ల నిధులతో టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ పనులన్నీ ఏడాదిలోగానే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇవే కాకుండా హైదరాబాద్​‌ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య 10 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని సర్కారు ఆలోచన చేస్తోంది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5 % ప్లాట్లు మహిళలకు, 15 % ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వ్ చేయనున్నారు. బహుళ అంతస్తుల పారిశ్రామిక భవనం, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి స్టాంప్ డ్యూటీ రాయితీలు, భూమి ధర రాయితీలను అందించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనుంది.

యంకతల పారిశ్రామిక వాడ రోడ్లకు రూ.31 కోట్లు

వికారాబాద్‌ ​జిల్లా మోమిన్‌​పేట్​ మండలం యంకతల గ్రామ పరిసరాల్లోని సర్వే నంబర్లు ​174, 198‌లో ప్రతిపాదిత తెలంగాణ మొబిలీటీ వ్యాలీ పారిశ్రామికవాడ చుట్టు రోడ్ల నిర్మాణానికి టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. సుమారుగా చుట్టూ తొమ్మిది రోడ్ల నిర్మాణానికి రూ.31 కోట్లా 58 లక్షలా 66 వేల 637 కేటాయించింది. ఈ నెల 16న బిడ్‌లను ​డౌన్​‌లోడ్ ​చేసుకునేందుకు సమయం ఇచ్చిన టీజీఐఐసీ బిడ్స్‌ను సమర్పించేందుకు ఈ నెల 31వ తేదీని తుది గడువుగా విధించింది.

దండు‌ మల్కాపూర్ పార్కుకు రోడ్లకు రూ.34 కోట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం దండుమల్కాపూర్​‌లో నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ ​పార్కు రెండో దశ కింద ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి రూ.34 కోట్లా 11 లక్షలా 13 వేల 440తో టెండర్లు పిలిచారు. ఈ రోడ్ల నిర్మాణం కోసం నెల క్రితం టెండర్లు పిలువగా, బిడ్స్​‌ సమర్పించేందుకు ఈ నెల 10 తుది గడువు విధించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద ఏర్పాటు చేస్తున్న సాలిడ్ వేస్ట్‌ ​సెగ్రిగేషన్ స్టోరేజ్‌ ​ఫెసిలిటీ కేంద్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. కోటి 26 వేల 819ని వెచ్చించనున్నారు. ఇలా వివిధ మౌలిక వసతులకు రూ.వంద కోట్ల నిధులతో టెండర్లను పిలుస్తున్నారు. హైదరాబాద్​ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై గల దండుమల్కాపూర్ ​ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్కుకు కేరాఫ్‌​గా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కోట్లాది రూపాయల పెట్టబడులతో కాలుష్య సమస్యలు లేని సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకే ప్రాంతానికి డెవలప్‌మెంట్ పరిమితం చేయకుండా హైదరాబాద్ ​చుట్టుపక్కల కూడా 10 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ది చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది.

Next Story