TG Govt.: బెట్టింగ్ యాప్స్‌పై సర్కార్ సీరియస్.. క్రైమ్ బ్యూరో స్పెషల్ ఫోకస్

by Kema Shiva Kumar |

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తన చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

TG Govt.: బెట్టింగ్ యాప్స్‌పై సర్కార్ సీరియస్.. క్రైమ్ బ్యూరో స్పెషల్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తన చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. వీటిని ప్రమోట్ చేస్తున్న వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నది. ఇలాంటి యాప్స్‌ను రాష్ట్రంలో అనుమతించేదే లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరోవైపు కేసులపై సెలెబ్రెటీలు హైకోర్టును ఆశ్రయిస్తున్నా.. అక్కడ వారికి చుక్కెదురవుతున్నది. అవగాహన లేక ప్రమోషన్స్ చేశామని, విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేసులు కొట్టివేయాలని పలువురు విన్నవించినా.. విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పై 2017 నుంచే నిషేధం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

‘సిట్’కు కేసు

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న 30 మందికి పైగా ప్రముఖ నటులు, యాంకర్స్, యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్స్ పై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)కు అప్పగించారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినా కఠిన చర్యలు తప్పవని, తెలంగాణ గేమింగ్ ఐటీ యాక్ట్ ద్వారా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోవడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటున్నది.

వెబ్‌సైట్లు బ్లాక్.. బ్యాంక్ ఖాతాలు సీజ్

ఆన్ లైన్ మనీ గేమింగ్ ప్లాట్ ఫామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హెచ్చరించింది. ఆన్ లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న 357 వెబ్ సైట్లు, యూఆర్ఎల్ లను బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి గత వారం రూ. 126 కోట్లను ఫ్రీజ్ చేసింది. ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ లో పాల్గొన్న సుమారు 700 ఆఫ్ షోర్ సంస్థలపైనా ప్రస్తుతం డీజీజీఐ నిఘా ఉంచనుంది. అంతేకాకుండా విదేశాల్లో ఈ తరహా సంస్థలు నిర్వహిస్తున్న పలువురు భారతీయులకు చెందిన 166 ఖాతాలను బ్లాక్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

జాతీయ భద్రతకు ప్రమాదం

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల దేశభద్రతకు ప్రమాదమని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చిన డబ్బులను కొన్ని సంస్థలు ఉగ్రవాద సంస్థలకు చేరవేస్తున్నాయని తెలుపుతున్నాయి. పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి చేపడుతున్న చర్యల్లో ఈ విషయాలు బయటపడ్డాయని చెబుతున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ను వినియోగించేటపుడు, డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో జాగ్రత్త వహించాలని పబ్లిక్ అడ్వైజరీలు సూచిస్తున్నాయి. యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందని, ఇది పౌరుల భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని టీజీసీఎస్బీ హెచ్చరిస్తున్నది. ఆన్‌లైన్ మోసాలను గుర్తించినట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్‌ లైన్ నంబర్ 1930కి డయల్ చేయాలని సూచిస్తున్నది.

యాప్స్ నియంత్రణకు జియో ఫెన్సింగ్.. శిఖాగోయల్, డీజీ, టీజీసీఎస్బీ

బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు జియో ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. గేమింగ్ యాక్ట్ ప్రతారం 2017 నుంచే ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ను రాష్ట్రంలో నిషేధించారు. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ నిషేధం ఉన్నది. ఇప్పటికే 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చాం. 2022 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై 797 కేసులు నమోదు చేశాం. విదేశాలనుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ వల్ల ఎక్కువగా నష్టం జరుగుతున్నది. గేమింగ్ కు సబంధించి 108 యూఆర్ఎల్ పై నిషేధం విధించాం. గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.

Next Story