TG Govt.: రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ.. మరమ్మతులకు రూ.1,600 కోట్లు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

TG Govt.: రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ.. మరమ్మతులకు రూ.1,600 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు రూ.1600 కోట్లు మంజూరు చేయాలని అనుకుంటున్నది. గ్రామీణ ప్రాంత రోడ్ల రిపేర్లపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆర్అండ్‌బీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ‘మా ఊరి రోడ్లను ఎందుకు బాగు చేయరు? అంటూ నిలదీస్తున్నారు. దీంతో ఈ వేసవిలో రోడ్ల అంశంపై దృష్టి పెట్టాలని సర్కారు భావిస్తోంది.

ఎమ్మెల్యేల నుంచి వినతులు

రోడ్ల నిర్మాణాలు, మరమ్మతుల కోసం స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఇటు ప్రభుత్వానికి, అటు ఆ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఆదేశాలతో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కొత్త రహదారుల నిర్మాణం, ఇతర పనులపై అధికారులు ప్రభుత్వంతో సంప్రదిస్తున్నారు. నియోజకవర్గాల్లో అవసరమైన చోట రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆర్‌‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కోరుతున్నారు. వారు పంపించే అంచనాలు రూ.50 కోట్లకు మించకూడదని ముందే స్పష్టం చేస్తున్నారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు భారీ అంచనాలతో ప్రతిపాదనలు పంపుతుండడంతో ఆఫీసర్లు తర్జన భర్జన పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రూ.180 కోట్లకు ప్రతిపాదనలు పంపగా వాటిని రూ.50 కోట్లకు తగ్గించి పంపాలని అధికారులు స్పష్టం చేయగా ఆయన దానిని సవరించి చివరకు రూ.70 కోట్లతో పంపించారని తెలుస్తోంది.

క్షేత్ర స్థాయిలో అధ్యయనం

దెబ్బతిన్న రోడ్లను గుర్తించాలని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేయడంతో ఆర్అండ్‌బీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఏయే మండలాల్లో ఎన్ని రోడ్లు దెబ్బతిన్నాయి? ఎన్ని కిలో మీటర్ల వరకు వెంటనే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది.. వంటి వివరాలను మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకు రానున్నారు. మంత్రికి వివరాలు సమర్పించే క్రమంలోనే ఖర్చు అంచనాలను రూపొందించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

కేంద్రం నుంచి రూ.900 కోట్లు

సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌) కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు అందజేయనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇలా పరిశీలించినా ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపితే.. మొత్తం కలిపి రూ.5 వేల కోట్లు దాటేస్తాయని అంటున్నారు. వాటికి కేంద్రం ఇచ్చే రూ.900 కోట్లు కలిపినా ఏ మాత్రం సరిపోయే అవకాశం ఉండదని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖకు రూ.12 వేల కోట్లు మంజూరు చేసే అవకాశం ఉన్నదని సమాచారం. వీటిలో పంచాయతీరాజ్‌కు కేటాయించిన నిధులు పోనూ మిగిలిన వాటిని సీఆర్‌ఐఎఫ్‌తో కలిపి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రహదారుల నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యత

కొత్త రోడ్ల నిర్మాణాలు, మరమ్మల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లకే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు వేసిన నాటి నుంచి కనీసం ఐదేళ్ల పాటు బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో చేసిన పనులకు రావాల్సిన బకాయిల గురించి ఇప్పటికే కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విన్నవించుకుంటుండగా మంత్రి కోమటిరెడ్డి చొరవ తీసుకుని వాటిని ఇప్పిస్తామని, అయితే కొత్తగా నిర్మించే రోడ్లు మాత్రం ఏ మాత్రం డ్యామేజీ వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారని తెలుస్తున్నది.

Next Story