సీఎం స్పీచ్ పైనే అందరి దృష్టి.. రేపు కేసీఆర్ సైలెన్సా? సెటైర్సా?

by Disha Web Desk 2 |
సీఎం స్పీచ్ పైనే అందరి దృష్టి.. రేపు కేసీఆర్ సైలెన్సా? సెటైర్సా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గత కొన్నాళ్లుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉప్పు-నిప్పు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం దద్దరిల్లుతోంది. మరోవైపు ఈడీ, ఐడీ, సీబీఐ దాడులతో అట్టుడుకుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత వరకు సీబీఐ నోటీసులు రావడం సంచలనంగా మారింది. దీనికి తోడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలు, గవర్నర్ నుంచి ఆధిపత్య పోరు వీటన్నింటిపై సీఎం కేసీఆర్ రేపటి సభలో ఎలా రియాక్ట్ కాబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఆదివారం ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో కేసీఆర్ పాల్గొనేలా భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ సభలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతోందనేదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ 3న జరగ్గా అదే రోజు రాత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు. దీంతో నెల రోజుల అనంతరం పబ్లిక్ మీటింగ్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా ఎవరిని టార్గెట్ చేయబోతున్నారనేదానిపై ఆసక్తి పెరుగుతోంది.

టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా పరిణామాలు:

తెలంగాణలో రాజకీయం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో గత కొద్దిరోజులుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహరంలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ ఎల్.రమణను విచారించగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు సంచలనం రేపాయి. మరోవైపు గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవిపై గ్రానైట్ వ్యాపార వ్యవహారం, నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ తో సంబంధాల వ్యవహారంలో సీబీఐ విచారణ టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ మద్యం పాలసీ కుంబకోణంలో కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం ఆ పార్టి శ్రేణులను మరింత షాక్ కు గురి చేస్తోంది. మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేస్తున్నాయి. మరో వైపు బీజేపీ పెద్దలు తెలంగాణపై ప్రత్యేక నజర్ వేయడం కారు పార్టీని మరింత కలవరానికి గురి చేస్తోంది. మరో వైపు ప్రతిపక్షాల విమర్శల పర్వం రోజురోజుకూ పెరిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు తోడు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మరోసారి తెలంగాణలో సైకిల్ పార్టీని యాక్టీవ్ చేసే ప్రణాళికలు వేయడంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అన్ని వైపుల నుంచి గడ్డుపరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

సైలెన్సా? సెటైర్సా?:

బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ కు రాష్ట్రంలో గట్టి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014, 2018లో ఎన్నికల్లో కేసీఆర్ పాచికలు పారినా ఈ సారి అలాంటి పరిస్థితులు లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ వ్యూహాలకు బీజేపీ, కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మోడీ, అమిత్ షా తెలంగాణపై ధీమాతో ఉన్నారు. కేసీఆర్ సర్కార్ ను గద్దెదించడం ఖాయం అని పదే పదే చెబుతున్నారు. మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణలో మంచి మద్దతే లభించింది. భవిష్యత్ పోరాటాలపై ఆ పార్టీ అంతర్గతంగా చర్చలు జరుపుకోంది. ఈ నేపథ్యంలో రేపటి సభలో కేసీఆర్ ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తారా లేక సెలైన్స్ గా నామమాత్రపు ప్రసంగంతో సైలెన్స్ గా ఉండిపోతారా అనేది తెలియరావడం లేదు. ఎందుకంటే కేసీఆర్ సభ జరిగిన తర్వాత కవితకు సీబీఐ ప్రశ్నించబోతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండనుందనేదానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతోంది. కాగా ఈ నెల 7న జగిత్యాలలోనూ కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రేపటి పాలమూరు, 7వ తేదినాటి జగిత్యాల సభలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు సభలకు రెండు లక్షల చొప్పున జనసమీకరణకు ప్రణాళికలు వేసుకుంటోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే కేసీఆర్ టూర్లు కొనసాగడం పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

Read more:

CM కూతురైనా.. ఢిల్లీ మంత్రి అయినా వదిలేది లేదు: MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed