- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా ఆదిలాబాద్ లో
రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఇక్కడ కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాగల నాలుగు రోజులు ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ సైతం పొగమంచు తగ్గడం లేదు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






