తెలంగాణ విద్యార్థులకు జపాన్‌ పర్యటన అవకాశం!

by Ajay Maddhiboyina |

కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇన్నోవేషన్స్‌ ఇన్‌ సైన్స్‌ పర్స్యూట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీసెర్చ్‌ (ఇన్స్ఫైర్ ) కార్యక్రమంలో భాగంగా, తెలంగాణకు చెందిన

తెలంగాణ విద్యార్థులకు జపాన్‌ పర్యటన అవకాశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇన్నోవేషన్స్‌ ఇన్‌ సైన్స్‌ పర్స్యూట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీసెర్చ్‌ (ఇన్స్ఫైర్ ) కార్యక్రమంలో భాగంగా, తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు జపాన్‌లో జరిగే సకురా సైన్స్‌ హైస్కూల్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. సైన్స్‌ విద్యను ప్రోత్సహించడం, యువ పరిశోధకులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా జపాన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏజెన్సీ (జేఎస్ టీ) ఈ యువజన మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన విద్యార్థులు జపాన్‌ను సందర్శిస్తారు. 2016 నుండి ఇప్పటివరకు తెలంగాణ నుండి 21 మంది విద్యార్థులు ఈ సకురా కార్యక్రమం కింద జపాన్‌ను సందర్శించారు.

2025-26 సంవత్సరానికి గాను, దేశవ్యాప్తంగా ఎంపికైన 54 మంది విద్యార్థుల్లో తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. వీరు జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ కాంపిటీషన్‌ (ఎన్ఎల్ఈపీసీ)లో ప్రదర్శించిన 60 ఉత్తమ ప్రాజెక్టులలో స్థానం సంపాదించుకున్నారు. ఈ విద్యార్థుల జపాన్‌ పర్యటన జూన్‌ 15 నుంచి 21 వరకు 7 రోజుల పాటు ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ (జాక్సా), ప్రముఖ యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థలు సందర్శించడంతో పాటు నోబెల్‌ గ్రహీతలతో ముఖాముఖి సంభాషించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ విద్యార్థులను అభినందించారు.

ఎంపికైన విద్యార్థులు:

ఎ. శివారెడ్డి - టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ (బి), దామరగిడ్డ, నారాయణ్‌పేట జిల్లా

శైలు సాయి శ్రీవల్లి - శ్రీ చైతన్య స్కూల్‌, మంచిర్యాల జిల్లా

శుభాశ్రీ సాహు - పరమిత హెరిటేజ్‌ స్కూల్‌, కరీంనగర్‌ జిల్లా

Next Story