PG Medical: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్ద పీట

PG Medical: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి తిరిగి మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తూ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ కోర్సులలో మేనేజ్‌మెంట్ కోటా (సబ్-కేటగిరీ–1) సీట్లలో 85శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ ఈ నెల 3వ తేదీన ఈ జీవో ఎంఎస్ నెం. 201 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే పాత విధానం మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తిరిగి రీ నోటిఫికేషన్ జారీ చేయనుందని వర్సిటీ రిజిస్ట్రార్ డా. నాగార్జున రెడ్డి దిశకు తెలిపారు. ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ కోర్సులలో మేనేజ్‌మెంట్ కోటా (సబ్-కేటగిరీ–1) సీట్లలో 85శాతం సీట్లను తెలంగాణ రాష్ట్ర స్థానికులకు కేటాయించేందుకు రీ నోటిఫికేషన్ వల్ల అవకాశం ఉంటుందన్నారు. కాగా ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాకే పోయేవి.

మన విద్యార్థులు సైతం ఈ సీట్ల కోసమే పోటీ పడాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల మేరకు ఇకపై 85శాతం కోటా మన విద్యార్థులకు, మిగిలిన 15శాతం సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు “ఆల్‌ ఇండియా కోటా” కింద ఇవ్వబడతాయి. ఇప్పటివరకు ఈ సీట్లన్నీ కూడా పూర్తిగా జాతీయ స్థాయిలోనే భర్తీ చేస్తూ వచ్చారు. ఫలితంగా గత పదేళ్లుగా తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదే స్థానిక విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా... స్థానిక విద్యార్థులు సీట్లు కోల్పోతున్న అంశంపై దిశ గత నెల 6వ తేదీన "85శాతం సీట్లు మనకే దక్కాలి" పేరిట కథనం ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక కోటా ఉన్నప్పుడు మన వద్ద ఎందుకు తీసుకురావడం లేదంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. జీవో సవరించకపోవడంతో సుమారు 382 (ఇందులో 70 సీట్లు పీజీ డెంటల్ విభాగం) పీజీ సీట్లను మన రాష్ట్ర విద్యార్థులు కోల్పోతున్న తీరును ప్రభుత్వం దృష్టికి దిశ తీసుకుపోవడంతో పాటు వెంటనే సర్కారు స్పందించి లోకల్ విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే కాళోజీ వర్సిటీ రీ నోటిఫికేషన్ వెలువరిస్తున్నారు.

Next Story