- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో తెలంగాణ టాప్..
జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్‌లో నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో.. జాతీయ స్థాయిలో రాష్ట్రం తొలి ర్యాంకును సాధించింది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద.. రాష్ట్రం మొత్తం 5,20,362 పనులు పూర్తిచేసింది. కాగా.. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం పురస్కారాలు ప్రదానం చేశారు. ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 100 అవార్డులను ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక పట్టణ స్థానిక సంస్థ, రెండు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రెండు పరిశ్రమలు, మూడు ఎన్‌జీఓలు, ఇద్దరు దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు. పీఆర్, ఆర్డీ కమిషనర్ డా.శ్రీజన రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
మొదటి కేటగిరీకి రూ.2 కోట్లు..
క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 వేల కృత్రిమ రీచార్జి, స్టోరేజ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూఫ్‌టాప్ వాన నీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేర్చారు. పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్లను మూడు కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు. మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి రూ.2 కోట్లు, సెకండ్ కేటగిరీ కింద కోటి రూపాయలు, మూడో కేటగిరీ కింద రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. జిల్లాల విభాగంలో కేటగిరీ-1 కింద దక్షిణ జోన్ నుంచి మూడు జిల్లాలను ఎంపిక చేయగా.. ఆ మూడింటినీ రాష్ట్రం కైవసం చేసుకుంది.
ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నగదు బహుమతిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నల్గొండ అడిషనల్ కలెక్టర్ జే.శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏరియాలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు.. హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. రూ.2 కోట్ల నగదు బహుమతిని కే.అశోక్ కుమార్ రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ అందుకున్నారు. కేటగిరీ-2లో వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు దక్షిణ జోన్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. రూ.కోటి చొప్పున కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, అభిలాష అభినవ్, రిజ్వాన్ భాషా షేక్ బహుమతులు అందుకున్నారు. ఇక.. కేటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ 1,3 ర్యాంకుల్లో నిలువగా.. రూ.25 లక్షల చొప్పున కలెక్టర్లు జితేష్ వీ పాటిల్, బి.విజయేందిర బహుమతులు అందుకున్నారు. అలాగే.. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీష్‌కు కూడా అవార్డు దక్కింది.






