సినిమా టికెట్ ధరల పెంపుపై ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంచలన ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-12 13:43:10  IST  )

ప్రభుత్వం జీఓ ఇచ్చినా ఇకపై సినిమాల టికెట్ల రేట్లను పెంచబోమని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది.

సినిమా టికెట్ ధరల పెంపుపై ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఐదు కీలక అంశాలపై చర్చించిన తర్వాత.. పర్సంటేజీల విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్లలో వేసే సినిమాల టికెట్ల ధరలను పెంచకూడదని నిర్ణయిస్తున్నట్లు నిర్మాత శిరీష్ సంచలన ప్రకటన చేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం జీఓ ఇచ్చినా ధరలను పెంచబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రేక్షకులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్లకు ఇది వర్తిస్తుందన్నారు. సింగిల్ స్క్రీన్లను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయానికి నిర్మాతలంతా సహకరించాలని కోరారు. జూన్ లో పెద్ది, మా ఇంటి బంగారం వంటి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న సమయంలో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పాన్ ఇండియా సినిమాల విడుదల సమయంలో.. ఇతర రాష్ట్రాల్లో పర్సంటేజీలు ఇస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో మాత్రం ఎందుకు పర్సంటేజీలు ఇవ్వరని శిరీష్ ప్రశ్నించారు. దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story