అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తరలిరానున్న దేశ విదేశాల ప్రముఖులు

by Kema Shiva Kumar |

హైదరాబాద్ వేదికగా భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు.

అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తరలిరానున్న దేశ విదేశాల ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి.

అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు టీఈఆర్ఐ (TERI), బీసీజీ (BCG), మైక్రాన్ ఇండియా (Micron India), హిటాచీ ఎనర్జీ (Hitachi Energy), ఓ2 పవర్ (O2 Power), గ్రీన్ కో (Greenko), అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals), ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad), నాస్‌కమ్ (NASSCOM), సాఫ్రాన్ (Safran), డీఆర్‌డీవో (DRDO), స్కై రూట్ (Skyroot), ధృవ స్పేస్ (Dhruva Space), అమూల్ (Amul), లారస్ ల్యాబ్స్ (Laurus Labs), సీఎంఆర్ (GMR), టాటా రియాలిటీ) Tata Realty, కోటక్ బ్యాంక్ (Kotak Bank), గోల్డ్ మ్యాన్ సాచెస్ (Goldman Sachs), బ్లాక్ స్టోన్ (Blackstone), డెలాయిట్ (Deloitte), క్యాపిటల్ ల్యాండ్ (Capita Land), స్విగ్గీ (Swiggy), ఏడబ్ల్యూఎస్ (AWS), రెడ్ హెల్త్ (RED Health), పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX), Sikhya Entertainment, Taj Hotels వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ‘Olympic Gold Quest’ సెషన్‌లో పాల్గొంటారు. దర్శకుడు రాజమౌళి, రితేష్ దేశ్‌ముఖ్, సుకుమార్, గుణీత్ మోంగా, అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు ‘Creative Century – Soft Power & Entertainment’ చర్చలో పాల్గొంటారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేయనున్నారు. దావోస్‌లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగాలని సీఎం స్వయంగా దగ్గరుండి సదస్సు ఏర్పట్లను సమీక్షిస్తున్నారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సదస్సు రెండో రోజున రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్‌ను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించారు.

Next Story