తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలలో భూముల కొనుగోలు, అమ్మకాలు పెరగడం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిక్కిరిసిపోతుంటాయి. ఈనెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ లోపు తమ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.

సెలవు రోజుల్లోనూ సేవలు...

ప్రజల సౌకర్యార్థం ఈ నెల 28, 30, మరియు 31 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ పనివేళల కంటే అదనపు సమయం పాటు ఈ కార్యాలయాలు తెరిచి ఉంచనున్నారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేసేందుకు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్లాట్లు బుక్ చేసుకున్న వారు నిర్ణీత సమయానికి కార్యాలయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

Next Story