- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Politics: ‘సోషల్ వింగ్స్’.. ఫుల్ యాక్టివ్! సొంత నేతలపై కుట్రలు.. పార్టీల అలర్ట్
ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రధాన పార్టీలు తమ (social media) సోషల్ మీడియా వింగ్‌లను యాక్టివ్ చేస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో మరోసారి ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. (Local body elections) స్థానిక సంస్థలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదైనా జరగవచ్చనే ప్రచారంతో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలోనే ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రధాన పార్టీలు తమ (social media) సోషల్ మీడియా వింగ్‌లను యాక్టివ్ చేస్తున్నాయి. తాము చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ధీమాతో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటే, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటోంది. ఇక తాజాగా పార్టీ సోషల్ మీడియా విభాగాలతో తెలంగాణ బీజేపీ వర్క్‌షాప్ నిర్వహించడం స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తిగా మారింది.
తిట్ల దండకం, అబద్ధాలు ప్రచారం
చేసిన పని చెప్పుకోవడం ఒకప్పటి రాజకీయమైతే ప్రత్యర్థులపై విరుచుకుపడటం సోషల్ మీడియాలో తిట్ల దండకం, అబద్ధాలు ప్రచారం చేయడం నేడు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రచార శైలిలో మార్పులు రావడంతో సోషల్ మీడియానే ప్రధానాస్త్రంగా నమ్ముకుంటున్న పార్టీలు యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రధానమైన వేదికల ద్వారా తిప్పికొట్టేందుకు మరింతగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఆన్‌లైన్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటోంది. కాగా తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు సన్నద్ధం అవుతోంది.
సొంత పార్టీ నేతలపైనా..
సోషల్ మీడియా వింగ్స్‌ను కేవలం ప్రత్యర్థులపైనే కాదు.. పార్టీకి నష్టంగా భావించే సొంత నేతలను దారిలో పెట్టేందుకు సైతం వాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలతో పార్టీ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆమెపై పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయొద్దని చాలా పోస్టులు కామెంట్స్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఇటీవల ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయనను కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు పోస్టులు, కామెంట్స్ ద్వారా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా సొంత పార్టీ నేతలపై కుట్రలు చేసేవారిని వదిపెట్టమని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు తాజాగా బీజేపీ సోషల్ మీడియా వర్క్‌షాప్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా అస్త్రాన్ని ప్రత్యర్థులపైనే ప్రయోగించాలని ఎంపీ ఈటల రాజేందర్ సైతం శ్రేణులకు సూచించారు.






