TG Police: రీ పోస్ట్ చేసే‌ముందు జాగ్రత్త! సోషల్ మీడియాపై నిఘా.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-04-19 11:35:26  IST  )

తెలంగాణలో సామాజిక మాధ్యమాలపై సైబర్ క్రైమ్ (Cybercrime police) పోలీసులు నిఘా పెట్టారు.

TG Police: రీ పోస్ట్ చేసే‌ముందు జాగ్రత్త! సోషల్ మీడియాపై నిఘా.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సామాజిక మాధ్యమాలపై సైబర్ క్రైమ్ (Cybercrime police) పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవల జరిగిన కొన్ని అంశాల ఆధారంగా సామాజిక మాధ్యమాలపై తీవ్ర స్థాయిలోనే పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. కొంత మంది నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి లవ్ పేరుతో యువతి, యువకులను ట్రాప్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్, అసభ్యకరమైన కంటెంట్, ఫేక్ వీడియోలు, బ్లాక్ మెయిల్ చేయడం వంటి ఘటనలు విపరీతంగా పెరిగాయి. నేటి యువత సైతం సోషల్ మీడియాను తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్రలకు వ్యతిరేకంగా కొంత మంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తమకు తెలియకుండానే కొంత మంది యూజర్లు నిజమైన వీడియోలు, ఫోటోలు అని.. ఫేక్‌వి పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవల కంచె గచ్చిబౌలి భూముల అంశంపై సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఏఐ పోస్టులతో తప్పుడు ఆరోపణలు చేయడం తెలంగాణ సైబర్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై (Telangana Police) తెలంగాణ పోలీసులు నజర్ పెంచారు. ఈ మేరకు ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా తెలంగాణ పోలీసులు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌, రీ పోస్టింగ్స్‌ చేసేముందు జాగ్రత్త. వ్యక్తిత్వ హననం, ఇతరుల్ని కించపరిచేలా పోస్టులు చేస్తే చర్యలు తప్పవు. శ్రుతిమించిన చేష్టలపై నిఘా ఉంటుందని గ్రహించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్‌ చేసేటప్పుడు పరిణామాలను ఆలోచించండి’ అంటూ తెలంగాణ పోలీస్ పేర్కొంది. కాగా, హెచ్ సీయూ వివాదంలో ఏఐ గిబ్లీ ఇమేజ్ ను రీ ట్వీట్ చేసిన నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ (Smita Sabharwal)కు గచ్చిబౌలి పోలీసులు గత నెలలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Click For Tweet Post..

Next Story