- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికే ఆదర్శంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ .. క్యూఆర్ కోడ్‌తో నకిలీ డాక్టర్లకు చెక్
తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) నకిలీ డాక్టర్లకు చుక్కలు చూపుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) నకిలీ డాక్టర్లకు చుక్కలు చూపుతున్నది. వైద్యరంగంలో పారదర్శకత, నైతికత, డిజిటల్ గవర్నెన్స్ లో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తూ నకిలీ వైద్యులకు చుక్కలు చూపిస్తున్నది. జిల్లా పాలనా యంత్రాంగం, పోలీసులు, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకయాంటీ క్వాకరీ సెల్స్ ఏర్పాటుచేసి అనధికారిక చికిత్స కేంద్రాలను మూసివేస్తున్నది. తెలంగాణలో కొనసాగుతున్న టీజీఎంసీ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. కౌన్సిల్ పనితీరును మెచ్చుకున్న నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) టీజీఎంసీ చైర్మన్ కు ఎన్ఎంసీ యాంటీ క్వాకరీ టీంలో చోటు కల్పించింది. గతంలో 20ఏళ్లుగా మెడికల్ కౌన్సిల్ ను నడిపిన వారు నకిలీ వైద్యులపై కేసుల విషయంలో పట్టనట్లుగా వ్యవహరించారు. కానీ 2024 జనవరిలో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత కౌన్సిల్‌ను పూర్తిస్థాయి సంస్కరణల దిశగా తీసుకెళ్లడంతో పాటు ఇప్పటి వరకు పెద్దఎత్తున నకిలీ వైద్యులపై చర్యలు తీసుకున్నారు.
నకిలీ వైద్యులకు హడల్
గతంలో ఇష్టానుసారంగా క్లినిక్స్ ఏర్పాటు చేసుకుని వైద్య విద్య అభ్యసించకుండా, గుర్తింపు లేకుండా వైద్యం అందిస్తూ వచ్చిన బోగస్ వైద్యులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సింహస్వప్నంగా మారింది. 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 400కు పైగా కేసులు నమోదు చేసి నకిలీ వైద్యులపై చర్యలు ప్రారంభించింది. ఎప్పుడు వచ్చి దాడులు చేసి కేసులు నమోదు చేస్తారోననే భయం బోగస్ డాక్టర్లలో పెరిగిపోయింది. దీంతో చాలాచోట్ల ఇల్లీగల్ క్లినిక్స్ మూసివేసే పరిస్థితి వచ్చింది.
క్యూఆర్ కోడ్‌తో చెకింగ్
రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వైద్యుడికి ఇప్పుడు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంది. దీన్ని ఆస్పత్రులు, పేషెంట్లు, అధికార సంస్థలు వెంటనే స్కాన్ చేసి వివరాలను ధ్రువీకరించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో నకిలీ వైద్యుల నిరోధానికి చక్కని అవకాశం ఏర్పడిందని డాక్టర్లు చెబుతున్నారు. గతంలో ఐదేళ్లకోసారి మాన్యువల్ విధానంలో రిజిస్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు డాక్టర్లు తమ రిజిస్ట్రేషన్లను ఆన్ లైన్ ద్వారానే చేసుకునేందుకు టీజీఎంసీ అవకాశం కల్పించింది. టీజీఎంసీ పోర్టల్, క్యూఆర్ కోడ్ సిస్టం ద్వారా వైద్యుల గుర్తింపు నమోదును సాధారణ ప్రజలే ఇప్పటికీ కొన్ని సెకన్లలోనే పరిశీలిస్తున్నారు. ఈ విధానం వైద్యసేవల్లో నమ్మకాన్ని పెంచడమే కాకుండా నకిలీ వైద్యుల కార్యకలాపాలను గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఏర్పడిందని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ను ఎన్ఎంసీ అభినందించింది.
వైద్యులపై ఫిర్యాదుల విచారణ
వైద్యులపై వచ్చే ఫిర్యాదులను వేగంగా, న్యాయంగా పరిష్కరించేందుకు నియమావళిని టీజీఎంసీ పునర్వ్యవస్థీకరించింది. రిజిస్టర్ అయిన వైద్యులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నది. వైద్యం అందించడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంపైనా పూర్తి పారదర్శకతతో పరిష్కరిస్తున్నట్లు టీజీఎంసీ తెలిపింది.
ఎన్ఎంసీలో చోటు
టీజీఎంసీ పనితీరును మెచ్చుకున్న ఎన్ఎంసీ... కౌన్సిల్ నకిలీ వైద్యులపై చేస్తున్న దాడులను ప్రత్యేకంగా అభినందించింది. దేశవ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ తీసుకురానున్న నూతన గైడ్ లైన్స్ రూపొందించేందుకు ఏర్పాటు చేసిన యాంటీ క్వాకరీ టీంలో టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ ను చోటు కల్పించింది. దేశవ్యాప్తంగా నకిలీ వైద్యులను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమాత్రం సరిపోవని ఎన్ఎంసీ భావిస్తోంది.
పారదర్శకంగా కౌన్సిల్
ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ కార్యవర్గం రాకముందు కౌన్సిల్ కార్యాలయమే ఓ షెడ్డులో నడిచేది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యుల రిజిస్ట్రేషన్ చేసే కౌన్సిల్ కు అధునాతన భవనం నూతన కౌన్సిల్ వచ్చిన తర్వాతే అందుబాటులోకి వచ్చింది. గతంలో 20 ఏళ్లుగా కౌన్సిల్ వ్యవహారాలు చూసిన వారు కేవలం 10 కేసులు మాత్రమే నమోదు చేస్తే ప్రస్తుత కౌన్సిల్ రెండేళ్ల లోపే 400 మంది నకిలీ వైద్యులపై ఆట కట్టింది. ఎథిక్స్ కు విరుద్ధంగా వైద్యం చేస్తున్న రిజిస్టర్డ్ వైద్యులు ఆరుగురిపైనా కేసులు చేశాం. భవిష్యత్తులోనూ కౌన్సిల్ పారదర్శకంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తుంది. - డాక్టర్ బండారి రాజ్ కుమార్, సభ్యుడు, టీజీఎంసీ






