రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ.. ఎగుమతుల హబ్‌గా మారుతున్న ఫ్యూచర్ సిటీ

by Naga Rani Yarlagadda |

రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ.. ఎగుమతుల హబ్‌గా మారుతున్న ఫ్యూచర్ సిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటి వరకు ఫార్మారంగ ఎగుమ‌తుల‌కు ప్రసిద్ధి చెందిన తెలంగాణ తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేష‌న‌ల్ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు రికార్డు ఫ‌ర్ ఇయ‌ర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్(నిర్యత్) పోర్టల్లో పొందుపరిచిన గణాంకాల ప్రకారం 2023-24 నుంచి 2024-2025 మధ్య తెలంగాణ.. దేశంలో ఇంజినీరింగ్ ఎగుమ‌తుల్లో అత్యధికంగా 117.9% వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. విమాన విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలు, పరిశ్రమ యంత్రాలు వంటి ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటుని నమోదు చేసింది. కేవలం రెండేళ్లలోనే ఇంజినీరింగ్ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయ‌ని గ‌ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మిగతా రాష్ట్రాల సగటు వృద్ధి 10% మాత్రమే..

2022–23లో 1,827 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2024–25 నాటికి 7,536 మిలియన్ డాలర్లకు చేరుతూ 103% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు(సీఏజీఆర్)ను న‌మోదు చేయ‌డం చారిత్రాత్మకం. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సగటు వృద్ధి కేవలం 10% మాత్రమే ఉండగా, తెలంగాణ రికార్డు నెల‌కొల్పే వృద్ధి న‌మోదు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర సరుకుల ఎగుమతుల్లో ఇంజినీరింగ్ వస్తువుల వాటా 38.44%కు చేరింది. ఇది తెలంగాణ ఎగుమతి రంగంలో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మార్పును సూచిస్తోంది. కాగా, 2025–26తో పాటు రానున్న పది సంవత్సరాల్లో ఇదే రకమైన వృద్ధిని కనబరిచే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.

అంతర్జాతీయ కంపెనీల కేంద్రాల ఏర్పాటుతో..

కాగా, ఈ వృద్ధికి గ‌ల‌ ప్రధాన కారణం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారీ స్థాయిలో ఉత్పత్తులు పెరగడమేనని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌బస్, సఫ్రాన్, జీఈ ఏవియేషన్, ప్రాట్ & విట్నీ, కాలిన్స్ ఏరోస్పేస్, హనీవెల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేయ‌డంతో, విడి విభాగాలు ఉత్పత్తి వ‌ల్ల తెలంగాణ రాష్ట్రం కీలక తయారీ కేంద్రంగా అవ‌త‌రించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన నాటి నుంచి గణనీయమైన పురోగతితో దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచింది. 2023-24లో 8వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఒక్క ఏడాదిలోనే 4వ అతిపెద్ద ఇంజినీరింగ్ ఎగుమతిదారుగా ముందుకు దూసుకెళ్లింది. ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధి కోసం భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అడుగులు పడుతుండగా, పరిశ్రమల కోసం మరే రాష్ట్రంలో లేని విధంగా భారీగా భూములు కలిగి ఉండడంతో రానున్న కాలంలో తెలంగాణ మరింత దూకుడు ప్రదర్శించనుంది.

తరలిరానున్న మరిన్ని తయారీ కంపెనీలు

సేవా రంగాలకోసం క్యూర్‌, తయారీ రంగాలకు ప్యూర్‌, వ్యవసాయ ఆధారిత రంగాలకు రేర్‌లుగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచన దీర్ఘకాలికంగా ఉపయోగపడనుంది. త‌యారీ రంగ కంపెనీల‌కు వ్యయ సామర్థ్యం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా వృద్ధి చెందుతున్న తయారీ రంగం కలిగి ఉండడంతో రాష్ట్రానికి మరిన్ని తయారీ కంపెనీలు రానున్నాయి. ఈ వేగంతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే ధీటుగా తెలంగాణ పోటీనిస్తోంది. రానున్న సంవత్సరాల్లో కూడా ఇంజినీరింగ్ ఎగుమతులు ఇదే రీతిలో పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story