- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ విషయంలో తెలంగాణదే అగ్రస్థానం’.. KTR కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. స్థిరమైన వృద్ధితో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం? అన్న అంశంపై లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. సంపద సృష్టి, సమాన పంపిణీలో తెలంగాణదే అగ్రస్థానం అని తెలిపారు. దృఢ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సంపదను సృష్టించడంతో పాటు దాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమానంగా పంచడమే ప్రత్యేకంగా నిలిపిందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి మధ్య అద్భుత సమతుల్యత సాధించిందన్నారు. 2014లో తలసరి ఆదాయంలో 12వ స్థానంలో రాష్ట్రాన్ని 2023 నాటికి మొదటి స్థానానికి తీసుకొచ్చామన్నారు. ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని త్రీ గార్జియస్ డ్యామ్‌కు సరిసమానమైన ప్రాజెక్టు తెలంగాణలోని కాళేశ్వరమని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో 80 మీటర్ల సముద్ర మట్టపు ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకునిపోయి ప్రతీ సీజన్ కు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామన్నారు. కేవలం మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామన్నారు.
కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి కోటి ఇండ్లకు మిషన్ భగీరథతో సురక్షిత మంచినీరు అందించిందన్నారు. బీఆర్ఎస్ పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్‌తోపాటు ప్రపంచంలోని ప్రఖ్యాత టెక్ కంపెనీలు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాదులో నెలకొల్పాయని చెప్పారు. తాము అధికారంలోకి రావడానికి ముందు 2014లో టెక్ పరిశ్రమలో మూడు లక్షల 23 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని, తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి అవి పది లక్షలకు చేరాయన్నారు. 2014లో రూ.56 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు, 2023 నాటికి రూ.2లక్షల 41 వేల కోట్లకు చేరాయన్నారు. టీఎస్ ఐపాస్‌తో ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో వస్తాయన్నారు. ఒకవేళ రాకుంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించి పరిశ్రమను ప్రారంభించుకోవచ్చన్నారు. టీఎస్ఐపాస్‌తో తమ హయాంలో 28 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్‌గా ఎదిగిందన్నారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను అందుకే ఫస్ట్ చాయిస్‌గా ఎంచుకోవాలన్నారు.






