- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ
కృష్ణా నదీ జలాల వినియోగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి చర్చకు దారితీసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నదీ జలాల వినియోగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి చర్చకు దారితీసింది. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని ఆరోపిస్తూ.. వాటిని వెంటనే అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)ని కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) రమేశ్‌బాబు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి సుమారు రూ.47,776.50 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ వెలుపలికి భారీ స్థాయిలో మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ప్రత్యేకంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి మళ్లింపును భారీగా పెంచేందుకు చర్యలు తీసుకున్నారని, దీనివల్ల తెలంగాణ హక్కులకు తీవ్రనష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
రాయలసీమ లిఫ్ట్ నుంచి 8 టీఎంసీల మళ్లింపు..!
ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్రణాళిక ఉన్నదని.. అయితే.. ఇతర ప్రాజెక్టులతో కలిపి రోజుకు 8 టీఎంసీల వరకు నీటిని బేసిన్ బయటకు మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. దీనికోసం శ్రీశైలం రైట్ మెయిన్ కాలువ విస్తరణ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు, కాలువల వెడల్పు 78 మీటర్ల వరకు పెంపు వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టుల పరిధిని పెంచి మొత్తం 114.75 టీఎంసీల అదనపు నీటిని వినియోగించాలనే ప్రణాళికతో ఆ ప్రభుత్వం ఉన్నదని వెల్లడించారు. అలాగే భవిష్యత్ ప్రాజెక్టుల పేరుతో మరో 176.457 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలికి మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులు కొత్తవి కాదని, అవి ఇప్పటికే ఉన్న లేదా కొనసాగుతున్న ప్రాజెక్టులేనని ఈఎన్సీ స్పష్టం చేశారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు వాటికి సంబంధించిన వివరాలు ఇప్పటికే సమర్పించామని పేర్కొన్నారు. జీవో 34 ద్వారా కొత్త స్టోరేజ్ అవకాశాలపై కేవలం డీపీఆర్ తయారీ కోసం మాత్రమే అధ్యయనం ప్రారంభించిందని వివరించారు. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా దోచుకోవడంపై కేఆర్ఎంబీ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు. ఆయా ప్రాజెక్టల సామర్థ్యాన్ని పెంచడం ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అలాగే.. కృష్ణా జలాల వినియోగంలోనూ ఏపీ పాల్పడుతున్న ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.






