- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంచుకోవాలి : మంత్రి తుమ్మల
రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో వరి నాట్లు ప్రారంభమైతాయని అధికారులు యూరియా సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

- రామగుండం నుండి రాష్ట్రానికి కనీసం 90 శాతం సరఫరా చేయాలి
- రైతులకు నానో యూరియాపై కంపెనీలు కూడా అవగాహన కల్పించాలి
- ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు ఎరువుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో వరి నాట్లు ప్రారంభమైతాయని అధికారులు ఈనెలాఖరు నాటికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన యూరియాను అత్యవసరంగా రాష్ట్రానికి తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం సచివాలయంలో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్‌తో పాటు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా, 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలోనే ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 90 శాతం తెలంగాణ అవసరాలకే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వనరులను వినియోగించి ఇక్కడే ఉత్పత్తి జరుగుతున్న యూరియా, రాష్ట్ర రైతులకు అవసరమైన సమయంలో అందకపోవడం అన్యాయమన్నారు. ఈ అంశంపై రామగుండం ఎరువుల కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.
గత నెలలో కేటాయింపుల మేరకు సరఫరా చేయని కంపెనీలు, మిగిలిన పరిమాణంతో పాటు ఈ నెల కోటాను కూడా సమయానికి సరఫరా చేయాలని ఆదేశించారు. రేక్ పాయింట్లకు చేరిన యూరియాను జిల్లాలకు తరలించే ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకూడదని, హ్యాండ్లింగ్, రవాణాలో నిర్లక్ష్యం కనబరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను హోల్ సేల్, రిటైల్ లో ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. యూరియా యాప్ ను మార్గదర్శకంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎరువులను అందించేందుకు ఒక సరికొత్త యాప్ ను తీసుకువస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని రెండు జిల్లాలలో ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. మన రాష్ట్రంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఈ యాప్ ను అమలు చేయనున్నారని తెలిపారు. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వాడుతున్న రైతుల అనుభవాలను వీడియో రూపంలో చిత్రీకరించి రైతు నేస్తం కార్యక్రమంలో ప్రసారం చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని, యూరియాను అధికంగా వినియోగిస్తే భూసారం దెబ్బతిని, భవిష్యత్తులో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఈ సమావేశంలో ఏపీసీ సురేంద్ర మోహన్, అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ డిజిటల్ వింగ్ డైరెక్టర్ సరితా లక్ష్మీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ డా. గోపి, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






