- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గురుకులాల్లో సెంట్రలైజ్డ్ టెండర్లకు ప్రణాళికలు
రాష్ట్రంలోని గురుకులాల్లో నెలకొన్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సర్కారు ప్లాన్ రచిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకులాల్లో నెలకొన్న సమస్యలకు చెక్ పెట్టేందుకు సర్కారు ప్లాన్ రచిస్తున్నది. ప్రస్తుతం అమలవుతోన్న సరుకుల కొనుగోళ్ల ప్రక్రియకు పుల్ స్టాప్ పెట్టి, ఆ స్థానంలో సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు క్షేత్ర స్థాయిలో జరుగుతోన్న అక్రమాలకు చెక్ పెట్టొచ్చనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వద్ద జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై డిస్కషన్ జరిగింది. తరచుగా స్టూడెంట్స్ విష ఆహారంతో అస్వస్థతకు గురికాకుండా ఉండాలంటే నాణ్యమైన ఆహారం అందించడమే పరిష్కారమనే అభిప్రాయానికి వచ్చారు.
పేరెంట్స్ కమిటీల పేరుతో దందాలు
ప్రస్తుతం చాలా చోట్ల గురుకులాలకు అవసరమైన ప్రొవిజన్స్ (పప్పులు, నూనె, కూరగాయలు, కారం, చికెన్, గుడ్లు) పేరెంట్స్ కమిటీల పేరుతో సరఫరా చేస్తున్నారు. జిల్లాల వారీగా పిలిచిన టెండర్లను ఇంతకాలం సదరు కమిటీలు దక్కించుకున్నాయి. ఈ కమిటీల పేరుతో కొందరు లోకల్ లీడర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు విమర్శలున్నాయి. ఇతరులు ఎవరైనా టెండర్ వేసేందుకు ధైర్యం చేయలేక పోయారనే ప్రచారం సైతం ఉన్నది. ఎందుకంటే ఆ కమిటీలకు సపోర్టుగా సీనియర్ ఆఫీసర్ల ప్రోత్సాహం ఉందనే ఆరోపణలున్నాయి. ఆ కమిటీలు విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు సప్లయ్ చేయకపోయినా నిలదీసే పరిస్థితులు లేవని, ఫలితంగా స్టూడెంట్స్ తరచుగా విష ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టాలంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రొవిజన్స్ కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
నిత్యం మానిటరింగ్‌తో నాణ్యత పెంపు
సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తే ఉన్నతాధికారుల మానిటరింగ్ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రధానంగా పప్పులు, ఆయిల్, చక్కెర, టీ పొడి లాంటి వస్తువులను ఒకే సంస్థ తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో అన్ని గురుకులాలకు ఒకే రకమైన వస్తువులు సరఫరా చేయడంతో పాటు నాణ్యతను పరీక్షించే వెసులుబాటు ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న క్షేత్ర స్థాయి కొనుగోలు ప్రక్రియలో నాసిరకం వస్తువుల సరఫరాను కట్టడి చేయలేక పోతున్నామని, ఒక వేళ గుర్తించినా బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.
మహిళా సంఘాల భాగస్వామ్యం
మెస్‌లకు అవసరమైన కూరగాయలు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి సరఫరా పనులను మహిళా సంఘాలకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై సీఎం ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా మహిళలకు ఉపాధి సైతం లభిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే చికెన్, గుడ్లు సరఫరా పనులను స్థానికంగా ఉండే పౌల్ట్రీ రైతులకు అందించాలా? వాటికి ప్రత్యేకంగా టెండర్లు పిలవాలా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అలాగే పిల్లలకు అవరమైన సబ్బులు, పేస్టు, టూత్ బ్రెష్ సరఫరా పనులు సైతం మహిళా సంఘాలకే ఇవ్వాలని భావిస్తున్నారు. మరో వైపు వాటిని కొనుగోలు చేసేందుకు పిల్లల చేతికి డబ్బులు ఇవ్వకుండా, ఏటీఎం తరహాలో కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ కార్డులు కేవలం మహిళా సంఘాలు అందించే షాపుల్లో, పిల్లలకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకే చెల్లుబాటు అయ్యేలా సాఫ్ట్‌వేర్ తయారు చేయాలని నిర్ణయానికి వచ్చారు.






