TG: మరోసారి మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వం

by Prasad Jukanti |

ఇండియన్ ఎంబసీ చేతులెత్తేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

TG: మరోసారి మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరోసారి మానవత్వం చాటుకుంది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ (Gulf) దేశానికి వెళ్లి అక్కడ మరణించిన ఓ కార్మికుడి మృతదేహాన్ని భారత్ కు తరలించేందుుక అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, ఇండియన్ ఎంబసీ చేతులెత్తిసిన పరిస్థితితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం సహాయనిధి (CM Relief Fund) ద్వారా రూ. 1.50 క్షల ఆర్థిక సహాయం అందజేసి కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నిజామాబాద్ జిల్లా (Nizamabad) నవీపేట మండలం యామ్చా గ్రామానికి చెందిన గొల్ల అబ్బులు (తొగరి అబ్బయ్య) అనే 40 ఏళ్ల కార్మికుడు నాలుగు నెలల క్రితం ఓమాన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఒక క్లీనింగ్ కంపెనీలో పని చేయడానికి వెళ్లాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వెళ్లిన కొంతకాలానికే, డిసెంబర్ 14న అంటే ఆ దేశానికి వెళ్లిన మూడు నెలల్లోనే ఇబ్రి ప్రాంతంలో మృతి చెందగా బాధిత కుటుంబం సీఎం ప్రవాస ప్రజావాణిని ఆశ్రయించగా మానవత్వంతో ప్రభుత్వం గంటల వ్యవధిలోనే స్పందించింది.

చేతులెత్తేసిన ఇండియన్ ఎంబసీ:

తమ అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి)గా పరిగణిస్తారు. దీంతో వారికి లభించాల్సిన హక్కులు, సౌకర్యాలు సైతం రద్దవుతాయి. అబ్బులు విషయంలోనూ అదే జరిగింది. మృతుడు తమ కంపెనీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి అతనితో మాకు సంబంధం లేదని మృతదేహం తరలింపు ఖర్చును భరించబోమని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ, మృతదేహం తరలింపుకు రూ.1.50 లక్షలు చెల్లించాలని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు కుటుంబానికి ఫోన్ చేసి తెలిపారు. ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఓమాన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు.

సీఎం ప్రవాసీ ప్రజావాణికి వినతిపత్రం:

ఈ పరిస్థితుల్లో మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి తన కుమారుడు సంజయ్, యామ్చా గ్రామ సర్పంచ్ బేగారి సాయిలుతో కలిసి మంగళవారం (13.01.2026) హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయాలని ఆమె వేడుకున్నారు. కాగా ఆమె ఇదివరకే డిసెంబర్ 29న మెయిల్ ద్వారా సీఎంఓకు వినతిపత్రం పంపారు. దీనికి స్పందనగా జీఏడి ఎన్నారై విభాగం ఇండియన్ ఎంబసీకి వైర్ మెసేజ్ పంపింది. ఇదే అంశాన్ని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి, ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్‌కు వివరించగా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని వెంటనే స్పందించారు. ఓమాన్‌కు వెళ్లిన మూడు నెలలకే అబ్బులు మృతి చెందడం, నెలరోజులుగా ఆసుపత్రి శవాగారంలో మృతదేహం ఉండిపోవడం, భర్త పార్థివదేహం కోసం గ్రామం నుంచి హైదరాబాద్ వరకు వచ్చి మొరపెట్టుకున్న భార్య పరిస్థితి ఆమెను చలింపజేసింది. ఫలితంగా, ఓమాన్ నుంచి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన రూ.1.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్య చిన్న సావిత్రికి అందజేశారు.

'మదద్' పోర్టల్ లో నమోదైనా నో బీమా:

వలస కార్మికుడు విదేశాల్లో మరణించినప్పుడు మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును ప్రవాసీ పాలసీ ద్వారా పొందే అవకాశాన్ని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వినియోగించకపోవడం చర్చనీయాశంగా మారింది. అబ్బులు చిన్నాపూర్‍కు చెందిన ఒక గల్ఫ్ సబ్ ఎజెంట్ కు రూ.1.20 లక్షలు చెల్లించి ఓమాన్ కు వెళ్ళాడు. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మాత్రం అస్సాం రాజధాని గౌహతి లోని ఒక రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా జరిగింది. ప్రవాసీ భారతీయ బీమా యోజన (పిబిబివై) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాదం బీమా పాలసీ కూడా జారీ అయింది. చట్ట ప్రకారం శవాన్ని తరలించే బాధ్యత రిక్రూటింగ్ ఏజెన్సీ తీసుకోవాలి. సమస్య 'మదద్' పోర్టల్ లో నమోదు అయిన తర్వాత కూడా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సరిగా పట్టించుకోలేదని స్పష్టం అవుతున్నది.

Next Story