- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యమకారులకు గుర్తింపు, సంక్షేమంపై కమిటీ కసరత్తు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని త్యాగాలు చేసిన ఉద్యమకారులను గుర్తించి సముచితంగా గౌరవించడానికి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని త్యాగాలు చేసిన ఉద్యమకారులను గుర్తించి సముచితంగా గౌరవించడానికి ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ ప్రస్తుతం తమకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు వేగంగా కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తోంది. ఉద్యమంలో జైలు శిక్షలు అనుభవించిన వారు, పోలీసు కేసులు నమోదైనవారు, అమరవీరుల కుటుంబాలు, క్షతగాత్రులను గుర్తించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కళాకారులు, కవులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగుల వివరాలను సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితాను తయారుచేయనున్నది. అర్హులైన ఉద్యమకారులకు ప్రభుత్వం కల్పించాల్సిన గుర్తింపు, అధికారిక హోదా, రాయితీలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనున్నది. సమగ్ర నివేదికను రూపొందించేందుకు వీలుగా అనేక వర్గాలతో సమావేశం కావాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇటీవల అధికారులతో భేటీ అయింది. తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. రాబోయే రోజుల్లో యూనివర్సిటీల్లోని విద్యార్థి జేఏసీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీలతో సమావేశాలు నిర్వహించేందుకు కమిటీ సిద్ధం అవుతున్నట్లుగా తెలిసింది.
ఇతర రాష్ట్రాల్లో ఉద్యమకారులకు పాలసీలు
ఉద్యమకారులను గుర్తించిన తర్వాత ప్రభుత్వం అందజేసే పథకాలపై కమిటీ విస్తృతంగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ కంటే ముందుగా ఏర్పడిన జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులకు పథకాలను అమలు చేస్తున్న తీరుపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలిసింది. జార్ఖండ్ రాష్ట్రంలో జార్ఖండ్ ఆందోళనకారి చిన్హితీకరణ్ ఆయోగ్(జేఏసీఏ) పేరిట ఉద్యమకారులను గుర్తించి, వారికి, వారి కుటుంబ సభ్యులకు పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. జైలులో గడిపిన సమయాన్ని అర్హతగా తీసుకొని మూడున్నర వేల నుంచి రూ.7వేల వరకు పెన్షన్ ఉంటుంది. ఉద్యమకారులకు లేదా వారిపై ఆధారపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% సమాంతర రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఉద్యమకారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రమాణ పత్రాలు అందిస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లోనూ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించిన, గాయపడిన వారి సంక్షేమం, గుర్తింపు కోసం అక్కడి ప్రభుత్వం పాలసీని అమలు చేస్తోంది. దీని కింద ఉద్యమకారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% సమాంతర రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఉద్యమ సమయంలో కనీసం 7 రోజులు జైలు శిక్ష అనుభవించిన, గాయపడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ అందిస్తోంది.






