TG: ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోండి.. కలెక్టర్లకు CS ఆదేశం

by Gantepaka Srikanth |

TG: ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోండి.. కలెక్టర్లకు CS ఆదేశం

TG: ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోండి.. కలెక్టర్లకు CS ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ డ్రిల్ కార్యక్రమ నిర్వహణ, వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ రామకృష్ణ రావు(CS Ramakrishna Rao), జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (National Disaster Management Authority) అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెల 22న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్కర సమయాల్లో ప్రాణ నష్టాలు తగ్గించడంతో పాటు, ఆస్తి నష్టాలు తగ్గించగలుతామని స్పష్టం చేశారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని అన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని విధాల సాధనాలు వినియోగించుకోవాలని సూచించారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. దాదాపు 35 శాఖలు సమన్వయంతో మెలగాలని తెలిపారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీరు విడుదల, వంతెనలు, రోడ్ల స్థితి వంటి అంశాలపై వాస్తవ సమాచారం ప్రజలకు చేరవేయాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమగు సేవలకు టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు ద్వారా సమాచారం ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, వైద్య సేవలు అనేవి వైపరీత్యాల సమయంలో అత్యంత కీలకమని అన్నారు. రాష్ట్రంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహకారం అందిస్తాయని తెలిపారు.

అవసరమైతే అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవచ్చని అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు విపత్తు నివారణ చర్యలపై పలు అంశాలను కూలంకషంగా చర్చించారు.

Next Story