TG Cabinet: సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ.. కేబినెట్‌ భేటీలో కీలక చర్చ

by Prasad Jukanti |

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలపై చర్చ కొనసాగుతోంది.

TG Cabinet: సర్పంచ్ ఎన్నికలపై ఉత్కంఠ.. కేబినెట్‌ భేటీలో కీలక చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేబినెట్ భేటీ (Telangana Cabinet Meeting) కొనసాగుతున్నది. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొనసాగుతున్నది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరగగా ఇవాళ 19వ సారి కేబినెట్ సమావేశమైంది. ఇవాళ్టి భేటీలో గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్షతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణ విషయంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించే విషయంలో మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసే ప్లాన్!

స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని గత నెల 25న ఆదేశించింది. ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన 30 రోజుల గడువులో సగం రోజులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు వెళ్దాం? న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో మంత్రి మండలి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్లు అమలు చేయవచ్చనే వాదన తెరపైకి వచ్చింది. ఈ ఆర్టికల్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ల కల్పించే ఆలోచన సైతం అధికార పార్టీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ బిల్లు ఆమోదం కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడికి ఏదైనా ప్లాన్ చేస్తున్నదా? లేక జీవో ఇచ్చి ఎన్నికలు నిర్వహించబోతున్నదా..? ఇదేది కాదని పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించనున్నదా..? అనేది ఉత్కంఠగా మారింది. ఈ విషయంలో మంత్రిమండలి ఎలాంటి డెసిషన్ తీసుకోనున్నది మరికాసేపట్లో స్పష్టం కానుంది.

Next Story