రేపే కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపైనే కీలక చర్చ

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

రేపే కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపైనే కీలక చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర కేబినెట్​సమావేశం ఈనెల 17న సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరగనుంది. మీటింగ్ లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రుల అభిప్రాయాన్ని తీసుకుంటామని ఇదివరకే సీఎం ప్రకటించారు. కులగణన ఆధారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించినా కేంద్రం బీసీ బిల్లులకు ఆమోదం తెలపడం లేదు. రిజర్వేషన్లను 50శాతానికి పెంచేలా పంచాయతీరాజ్​చట్టసవరణకు గవర్నర్​సైతం ఆమోదం తెలపడం లేదు. హైకోర్టు 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. వీటితో పాటు 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం అమలుచేయడం లేదని కోర్టులో పిటిషన్​దాఖలైంది. ఈ కేసు విచారణ ఈనెల 24కు వాయిదాపడింది. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల అంశం కోర్టులో విచారణకు రానుంది. గత విచారణ సమయంలో ప్రభుత్వానికి మరికొంత సమయం కావాలని అడగడంతో కేసును గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా కోర్టుకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉండటంతో కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ముందే సర్పంచ్ ఎన్నికలు

ఇప్పటికే బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నోటిఫికేషన్​విడుదల చేశారు. ఒక రోజు సైతం నామినేషన్లు స్వీకరించారు. అయితే హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని, రిజర్వేషన్లను సవరించి ఎన్నికలను నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో 50శాతంతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనితో కేంద్రానికి మరికొంత సమయం ఇచ్చి ఎన్నికలు నిర్వహించడమా? లేకుంటే 50 శాతంతోనే ఎన్నికలు నిర్వహించడమా? అనే అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. ముందుగా పార్టీల గుర్తులేని జరిగే సర్పంచ్​ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పార్టీపరంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మరికొంత సమయం వేచి ఉండటమో తేల్చనున్నారు.

Next Story