- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం లిఫ్ట్ స్కీమ్‌కు తెలంగాణ అడ్డుకట్ట! పనులు నిలిపివేయాలంటూ పీపీఏకు లేఖ
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులు.. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఫేజ్-2 పనులు.. పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ అండ్ క్యాడ్ శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సీఈఓకు లేఖ రాశారు. ఫేజ్-2 లో 45.72 మీటర్ల పూర్తి నీటి మట్టం వరకు నీటిని నిల్వ చేయాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యత్నాలు తెలంగాణలో ముంపు, డ్రైనేజ్ సమస్యలు మరింత పెంచే ప్రమాదం ఉన్నదని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం, మణుగూరు ప్రాంతాలతో పాటు కిన్నెరసాని, ముర్రేడు వాగుల పరివాహక ప్రాంతాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, గోదావరి జల వివాద ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) నిబంధనల ప్రకారం ముందుగా జాయింట్ సర్వే చేసి, ముంపు ప్రాంతాల గుర్తింపు, రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ చర్యలతో తెలంగాణలో 954 ఎకరాలకు పైగా ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
అలాగే గోదావరిలో కలిసే 36 వాగులు, స్థానిక ప్రవాహాలపై బ్యాక్‌వాటర్ ప్రభావం, డ్రైనేజ్ నిల్వ సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాకముందు ఫేజ్-2 పనులు చేపట్టకూడదని డిమాండ్ చేశారు. ఇక గతంలో నిలిపివేసిన పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, పీపీఏ అనుమతులు లేకుండా మళ్లీ ప్రారంభిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2021-22 లోనే ఈ పనులు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నదని.. ఒక భాగంలో మార్పులు చేస్తే ఇతర అంశాలపై ప్రభావం ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి తెలిపిందని లేఖలో ప్రస్తావించారు. ముంపు ప్రాంతాల గుర్తింపు, రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు పోలవరం ఫేజ్-2 పనులు, లిఫ్ట్ స్కీమ్ పనులు చేపట్టకుండా ఏపీని నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం పీపీఏను కోరింది.






