ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత.. తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం

by Gantepaka Srikanth |

తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి హెచ్చరిక పంపింది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత.. తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి హెచ్చరిక పంపింది. ఆదివారం శాసనసభలో "తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ బిల్లు-2026"కు ఆమోదం లభించింది. ఎవరైనా ఉద్యోగి తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి కనీస అవసరాలను విస్మరిస్తే, వారి మొత్తం జీతం (Gross Salary) లో 15 శాతం లేదా రూ. 10,000 (వీటిలో ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఈ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పొందే సంస్థలు మరియు ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు (MLAs, MLCs, సర్పంచ్‌లు మొదలైనవారు) కూడా దీని పరిధిలోకి వస్తారు.

ఫిర్యాదు ఎవరికి చేయాలి?..

నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులు నేరుగా జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి (జిల్లా కలెక్టర్)కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జిల్లా స్థాయి అధికారి తీర్పుపై అసంతృప్తి ఉంటే, 'వయోవృద్ధుల కమిషన్'లో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మారుతున్న జీవనశైలి కారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఒంటరివారవుతున్నారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. "తల్లిదండ్రులు భారతీయ కుటుంబ వ్యవస్థలో విడదీయలేని భాగం. వారిని గౌరవంగా చూసుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. ఈ చట్టం ద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగడమే కాకుండా, సమాజంలో ఒక మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాం," అని ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారికి ఈ బిల్లు ఒక గుణపాఠం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story