Talasani Srinivas: యాదవ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలి

by Gantepaka Srikanth |

యాదవ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలని.. అప్పుడే రాజకీయంగా అభివృద్ధి సాధించగలమని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

Talasani Srinivas: యాదవ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదవ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలని.. అప్పుడే రాజకీయంగా అభివృద్ధి సాధించగలమని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శనివారం నాంపల్లిలోని తెలుగు అకాడమీలో నిర్వహించిన దక్షిణ భారత యాదవ ప్లీనరీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ యాదవ జాతి పెద్ద సంఖ్యలో ఉన్నదన్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాలలో పోటీ చేసి అత్యధిక స్థానాలలో యాదవులే సర్పంచ్‌లుగా గెలిచారని చెప్పారు. పార్టీలు ఏవైనా మనమంతా యాదవజాతి అనే విషయాన్ని మరువొద్దన్నారు. నీతి నిజాయితీకి మారుపేరు యాదవులని చెప్పారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఎంతో చైతన్యం వచ్చిందని తెలిపారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదటగా తెరిచేది యాదవుడేనని అన్నారు. వారినే గొల్ల మిరాసి అంటారని.. ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తే తాను తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు.

దీపావళి పండుగ తర్వాత యాదవులు సదర్‌ను కేవలం హైదరాబాద్‌లోని నారాయణగూడ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించే వారని, తాను మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేలా ప్రోత్సహించామని పేర్కొన్నారు. బీసీలంతా చైతన్యం కావాలని చెప్పారు. యాదవుల కోసం కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించిందని.. ఎకరం రూ.150 కోట్ల ఆ భూమి విలువ ఉన్నదన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే యాదవ విద్యార్థుల కోసం అద్భుతమైన భవనాన్ని నిర్మించామని.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని వివరించారు. యాదవులను ఏకం చేసేందుకు పోరాడుతున్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌ను ఈ సందర్భంగా తలసాని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బళ్లారి నగర మేయర్ గాదెప్పయాదవ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story