బిగ్ న్యూస్: స్పీడ్ పెంచిన T-బీజేపీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘‘మేనిఫెస్టో’’ కసరత్తు షురూ!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: స్పీడ్ పెంచిన T-బీజేపీ.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ‘‘మేనిఫెస్టో’’ కసరత్తు షురూ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సంస్థాగతంగా చర్యలు మొదలుపెట్టింది. మేనిఫెస్టోలో రూపొందించాల్సిన అంశాలపై అధ్యయనం కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని స్టేట్ యూనిట్ ఏర్పాటు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఏమేం చేయాలో లోతుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీకి స్టేట్ యూనిట్ చీఫ్ బండి సంజయ్ ఆదేశాలు జారీచేశారు.

నివేదిక వచ్చిన తర్వాత దాన్ని కోర్ కమిటీలో చర్చించి స్టేట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనున్నది. ఏ సెక్షన్ ప్రజలకు ఏ అంశం మేలు చేస్తుందో నిశితంగా స్టడీ చేయాల్సిందిగా బండి సంజయ్ సూచించారు. మరోవైపు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్లు ఇప్పటికే హామీ ఇచ్చినందున దానిపై నిపుణులతో బుధవారం హైదరాబాద్‌లో సమావేశం జరగనున్నది. డిక్లరేషన్‌లో పార్టీ ఇవ్వనున్న హామీలపై చర్చించనున్నది.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా మేనిఫెస్టోను రూపొందించాలని బీజేపీ రాష్ట్ర యూనిట్ భావిస్తున్నది. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడే అంశాలను గుర్తించి పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విఠల్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది.

వివిధ రంగాల నిష్ణాతులతో సమావేశమై ఆ నివేదికను అందజేయాలని బండి సంజయ్ ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత పార్టీ కోర్ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి మేనిఫెస్టో ఫైనల్ కానున్నది. మేనిఫెస్టోలో పేర్కొనాల్సిన అంశాలపై స్పష్టతకు రావడానికి ముందు గడచిన నాలుగేళ్లుగా బండి సంజయ్ నాయకత్వంలో ఏయే అంశాలపై పార్టీ ఎలాంటి పోరాటాలు చేసిందో, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలేమిటో ఈ కమిటీ సేకరిస్తున్నది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సహా పలు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రత్యామ్నాయంగా ఎదిగిన క్రమంలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పూర్తిస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యేలా అధ్యయనం చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది.

అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని, నిలువ నీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఏటా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నదీ జాబ్ క్యాలెండర్ రూపంలో ప్రకటిస్తామని, రైతులకు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. వీటితోపాటు స్థానిక సమస్యల పరిష్కారంపైనా పలు హామీలిచ్చింది. ఈ హామీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సాధికారత వంటి అంశాలపై అయా రంగాలలో నిష్ణాతులైన మేధావులతో చర్చించి ఒక రోడ్ మ్యాప్ తయారుచేసి పూర్తి స్థాయి నివేదికను పార్టీకి ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కమిటీని బండి సంజయ్ ఆదేశించారు.

బీసీ సబ్-ప్లాన్, బీసీ డిక్లరేషన్ అధ్యయనం చేసేందుకు విఠల్‌తో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చంద్రవదన్, రిటైర్డ్ ఐపీఎస్ క్రిష్ణప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, మహిళా మోర్చా జాతీయ నేత కరుణా గోపాల్ హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు. బీసీ మేధావులు, విద్యావేత్తలతోపాటు పలువురు నిష్ణాతులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. బండి సంజయ్ కూడా హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read More... తెలంగాణలో అనుహ్యంగా మారిన పొలిటికల్ ట్రెండ్.. ఆ పార్టీ పుంజుకోవడంతో BRS అలర్ట్!


Next Story

Most Viewed