తెలంగాణలో మరో అగ్ర మావోయిస్టు లొంగుబాటు.. కొనసాగుతున్న సస్పెన్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-01 14:55:27  IST  )

తెలంగాణలో మరో మావోయిస్టు అగ్ర నేత లొంగుపోయారని జరుగుతున్న ప్రచారంపై సస్పెన్స్ కొనసాగుతోంది...

తెలంగాణలో మరో అగ్ర మావోయిస్టు లొంగుబాటు.. కొనసాగుతున్న సస్పెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టుల(Maoists) ఏరివేతే లక్ష్యంగా నాలుగు రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar) కొనసాగుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలని లేదంటే కాల్చేస్తామని భద్రతా బలగాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులను మట్టుబెట్టింది. మిగిలినవారిని కూడా ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిపోవాలన్న పిలుపుతో కొందరు మావోయిస్టు నేతలు ఇప్పటికే లొంగిపోయారు. ఇందులో ఆశన్న, మల్లోజుల లాంటి అగ్ర మావోయిస్టులు సైతం ఉన్నారు.

బర్సె దేవా లొంగుబాటుపై సస్పెన్స్

అయితే మరో అగ్ర మావోయిస్టు బర్సె దేవా అలియాస్ సుక్కు తాజాగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ ఆపరేషన్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా పోలీసులు జరిపిన రాయబారంలో బర్సె దేవా లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. కానీ పోలీసులు అధికారికంగా ప్రకటించకపోవడంపై బర్సె దేవా అసలు అరెస్ట్ అయ్యారా.. లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని కొందరు పోలీసులు చెప్పుకుంటున్నారు. ఇక బర్సెపై రూ. 50 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.

హిడ్మాతో కలిసి 15 ఏళ్లు ఆపరేషన్లు

కాగా బర్సె దేవా.. హిడ్మాతో కలిసి దాదాపు 15 ఏళ్లు కలిసి పని చేసినట్లు సమాచారం. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ నెంబర్ బెటాలియన్ కమాండెంట్ గా హిడ్మా పని చేశారు. ఆయన పదోన్నతిపై కేంద్రకమిటీలోకి వెళ్లిన తర్వాత ఆ బాధ్యతలను బర్సె దేవా చేపట్టారు. ఈ బాధ్యతతో పాటు అదనంగా స్టేట్ మిలిటరీ కమిషన్‌గా కూడా వ్యవహరించారు. తొలుత దర్భా డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయిలోనూ దేవా పని చేశారు. ఆ తర్వాత 1వ బెటాలియన్ కమాండెండ్ బాధ్యతలను సైతం చేపట్టారు. అలా పలు ఆపరేషన్‌లో కీలక పాత్ర వహించారు. సీఆర్ఫీఎఫ్ జవాన్లపై జరిపిన కాల్పుల్లో బర్సె దేవా ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో ఛత్తీస్‌గఢ్ పోలీసులే చెప్పడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ పౌర హక్కుల సంఘం కీలక డిమాండ్

మరోవైపు బర్సె లొంగుబాటుపై పోలీసులు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం కోరుతోంది. వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. బర్సె లొంగుబాటుపై మరో రెండు రోజుల్లో పోలీసులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Next Story