- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: 3 నెలలే గడువు.. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధిస్తూ సంచలన తీర్పు
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రపతి పరిశీలన కోసం ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపించే బిల్లు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపించే బిల్లులపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి నిర్ణయానికి గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. తమిళనాడు స్టేట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసులో జస్టిస్ జె.బి పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ తో కూడిన ధర్మాసనం సుధీర్ఘ విచారణ చేసి ఈ సూచన వెలువరించింది. అయితే బిల్లులపై ఆమోదం తెలపడానికి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలవ్యవధిని నిర్ణయించడం ఇదే తొలిసారి.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏప్రిల్ 8వ తేదీన తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించి 415 పేజీల తీర్పు కాపీలను తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఈ తీర్పులో గవర్నర్లు పంపించే బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయానికి కేవలం మూడు నెలలు మాత్రమే గడువు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అయితే అందుకు గల కారణాలను రాష్ట్రాలకు తెలిపాలని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ సందేహాలను వీలైనంత త్వరగా నివృత్తం చేయాలని సూచించింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడవు ఒక నెల మాత్రమేనని, ఒక వేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపించాలని ధనుర్మాసం ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొంది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు పని చేయడం తప్ప గవర్నర్ కు ప్రత్యేకంగా విచక్షణాధికారాలేవి లేవని రాజ్యంగంలోని 200వ అధికరణ ఇదే విషయాన్ని చెబుతోందని స్పష్టం చేసింది.
చరిత్రలో తొలిసారి..:
సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొత్త రికార్డు నమోదు చేసింది. రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేసింది. ఈ మేరకు తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.






