- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై లంచం అడిగితే కటకటాల్లోకే..
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనే లక్ష్యంతో ప్రతి అర్హుడికీ ఇళ్లు మంజూరు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండొద్దనే లక్ష్యంతో ప్రతి అర్హుడికీ ఇళ్లు మంజూరు చేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పటికే లక్షలాది నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే.. లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడ అవకతవకలు జరగవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఓ యాప్‌ను సైతం తెచ్చింది.
ఆ యాప్ ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేసి.. బిల్లుల చెల్లింపు వరకూ దానినే వినియోగిస్తున్నది. ఇంత చేస్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కాల్ సెంటర్‌ను సైతం ప్రారంభించింది. ఇల్లు మంజూరు కోసం.. బిల్లుల కోసం ఎవరైనా లంచం అడిగినా, ఇబ్బంది పెట్టినా వారిపై సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్నది.
కాల్ సెంటర్‌కు భారీ రెస్పాన్స్..
క్షేత్రస్థాయిలో పథకం అమలులో పలు ఇబ్బందులు వస్తుండడంతో.. కొంత మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వెంటనే లబ్ధిదారులే నేరుగా తమ సమస్యను చెప్పుకునే విధంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 18005995991 కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ కాల్ సెంటర్‌కు లబ్ధిదారుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తున్నది. రోజుకు 200కు పైగా కాల్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా అధికారుల అవినీతి మీద, ఆధార్ తప్పుల సవరణ, జియో ట్యాగింగ్ సమస్యలపై కాల్ సెంటర్‌కు ఫోన్లు వస్తున్నాయి. వీటితో పాటే లబ్ధిదారులు ఏ అనుమానాలు వచ్చినా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకుంటున్నారు. ప్రజల నుంచి కాల్ సెంటర్‌కు వందల సంఖ్యలో కాల్స్ వస్తుండడంతో ఇప్పటివరకు 12 మందితో కొనసాగుతున్న కాల్ సెంటర్ కెపాసిటీని పెంచేందుకు గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకున్నది. కంప్యూటర్లను మరిన్ని పెంచి లబ్ధిదారులకు మరింత ఎక్కువ స్థాయిలో సేవలందించాలని ప్లాన్ చేస్తున్నది.
అధికారుల అవినీతిపై సీరియస్..
కాల్ సెంటర్‌కు పలువురు లబ్ధిదారులు ఫోన్లు చేసి అధికారులు డబ్బులు అడుగుతున్న విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు సైతం డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దాంతో ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణం కమిటీ నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తయ్య రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.
అదే విధంగా జనగాం జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు నుంచి పంచాయతీ సెక్రెటరీ రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. వెంటనే వాటిపై విచారణ చేపట్టగా.. పోలుమల్లలో ఇందిరమ్మ కమిటీ సభ్యుని పాత్ర ఉందని తేలింది. దాంతో ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పేదలను ఇబ్బందిపెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండ్లు మంజూరు కాకున్నా నలుగురి ఖాతాల్లో నిధులు జమచేసిన గ్రామ పంచాయతీ సెక్రెటరీలను తక్షణమే సస్పెండ్ చేశారు.
లబ్ధిదారులకే యాప్ బాధ్యతలు..
ఈ పథకం అమలులో ముందు నుంచీ ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. బిల్లుల కోసం ఇంటి నిర్మాణాల ఫొటోలను సైతం యాప్‌లో లబ్ధిదారులే అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించారు. ఇలా యాప్‌లో రోజుకో మార్పు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఇప్పటివరకు చాలా మంది లబ్ధిదారులు ఆధార్‌లో తప్పిదాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇకముందు వాటికీ ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులే ఆధార్‌ను యాప్‌లో అప్‌డేట్ చేసేలా మార్పులు తీసుకొస్తున్నట్లు ఇటీవల మంత్రి ప్రకటించారు.
అంతేకాకుండా.. ఇప్పటివరకు యాప్‌లో ఎలాంటి మార్పులుచేర్పులు చేయాలన్నా ఆ యాక్సెస్ అంతా ఎండీ చేతుల్లోనే ఉండేది. చివరకు ఆధార్‌లో తప్పులు ఉన్నా కలెక్టర్ నుంచి రిక్వెస్ట్ వస్తే.. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లో మార్పులు చేసేవారు. యాప్ అప్‌డేట్ అయ్యేంత వరకు ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ఇక నుంచి ఎంపీడీవోల స్థాయిలో సిఫారసులు పంపితే.. వాటిని కలెక్టర్ సరిచేసేందుకు యాక్సెస్ ఇచ్చారు. మరి కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతలను సైతం లబ్ధిదారులకే ఇవ్వనున్నారు.






